- ప్రజలు ఇంకా ఎందుకు మోసపోతూనే ఉన్నారు?
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశ, బలహీనతల వల్ల ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరైన ఆదాయం లేనివారు అంటే నిరుద్యోగులు, గృహిణులు ఎంతోకొంత ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో తెలియకుండానే ఈ ఊబిలో దిగుతున్నారు. పైగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న ఈ సంస్థల నిర్వాహకులు వీరిని రెచ్చగొడుతున్నారు. ‘మీ తోటివారు బాగుపడుతున్నారు, మీరు మాత్రం అలానే ఉంటున్నారు. వచ్చిన అవకాశం కోల్పోతున్నారు, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం మీకు లేదు’ అంటూ వారిపై మానసిక యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి పథకాల్లో చేరాల్సిన తప్పనిసరి పరిస్థితి కల్పిస్తున్నారు.
- మోసపూరిత సంస్థలపై ప్రభుత్వాలకు నియంత్రణ ఎందుకు ఉండటం లేదు?
మన దేశంలో వివిధ రకాల సంస్థలకు రకరకాల చట్టాలు ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఓ సంస్థ చేస్తున్న మోసం గురించి పోలీసులు దర్యాప్తు మొదలుపెడితే మరో సంస్థ తమకు అనుమతి ఇచ్చిందంటూ పత్రాలు చూపించి అయోమయానికి గురిచేస్తున్నాయి. పైగా ఇలాంటి సంస్థలను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన వ్యవస్థ దేశంలో లేదు. ఏ ప్రభుత్వ శాఖకూ ఇలాంటి పథకాలు, సంస్థలను నియంత్రించే బాధ్యతలు కేటాయించలేదు. మోసం జరిగిన తర్వాత మాత్రమే పోలీసుల దృష్టికి వస్తోంది. ఈ పద్ధతి మారాలి. ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించే సంస్థలూ చొరవ తీసుకోవాలి. అంతా కలిసి పనిచేసినప్పుడే వీటిని అరికట్టడం సాధ్యం. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడుతుందన్న విషయం ఎవరూ గుర్తించడంలేదు.
- గొలుసుకట్టు మోసాల పరంగా ప్రజల్లో ఏ మేరకు మార్పు గమనించారు?
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త సంస్థలు, కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. అలానే మోసపోయే కొత్త తరం కూడా ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మోసం చేసే పరిధి, వేగం కూడా పెరిగాయి. ఇలాంటి సంస్థలపై ఇప్పుడు పోలీసులు మాత్రమే పోరాటం చేస్తున్నారు. మిగతా ప్రభుత్వ సంస్థలు కూడా కలిసి వస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.
- ఇప్పుడున్న చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందా?
చట్టం చాలా బలంగా ఉంది. దీన్ని పకడ్బందీగా ఉపయోగిస్తే చాలు. 1965లోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దేశంలో ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసే సమయంలో ఇతర విభాగాల ప్రమేయం వల్ల తప్పించుకునేందుకు ఆయా సంస్థలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. చట్టం బలహీనంగా ఉందనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. ఇలాంటి నేరాలు రుజువైనప్పుడు విధిస్తున్న మూడేళ్ల శిక్ష మాత్రం ఇంకాస్త పెంచాలి. ఈ తరహా నేరాలు త్వరితగతిన విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- ఈ సంస్థలు అంటగడుతున్న ఉత్పత్తులను ఎంతవరకూ నమ్మొచ్చు?
ఇందులో రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి. డబ్బు లావాదేవీలు లేవని చెప్పేందుకు ఏదో ఒక ఉత్పత్తిని అంటగడుతున్నారు. దీనికి అడ్డగోలు ధర నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా ఔషధ, ఆహార సంబంధిత ఉత్పత్తులై ఉండడం మరో అంశం. వీటికి ఔషధ, ఆహార నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు ఉండటంలేదు.
- ప్రజలకు మీరు ఇచ్చే సూచనలేమిటి?
ఎక్కడైనా పెట్టుబడి పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అధిక వడ్డీ చెల్లిస్తామంటే అనుమానించాలి. పెట్టుబడి పెట్టే సంస్థ లోతుపాతులు విచారించాలి. తాము పెట్టే ప్రతి పైసా కష్టార్జితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులను, ఇతర శాఖలను అప్రమత్తం చేయాలి.
- మోసాలను ఆదిలోనే అదుపుచేసే మార్గం ఏమైనా ఉందా?
మోసానికి ఎక్కడో ఒక చోట బీజం పడుతుంది. ఉదాహరణకు నలుగురు స్నేహితులు కలుసుకున్నప్పుడో, చిన్నపాటి విందు సమావేశాల్లోనో చర్చ జరుగుతుంది. అప్పుడే దీని గురించి పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే మోసం పరిధి పెరగకుండా ఆదిలోనే అడ్డుకోవచ్చు. ఇది ప్రజల వైపు నుంచి జరగాలి. ఇక బ్యాంకులు కూడా తమ వద్ద జరుగుతున్న లావాదేవీలు గమనిస్తుండాలి. ఏదైనా సంస్థ లావాదేవీలు పెరిగినట్లు గుర్తిస్తే బ్యాంకు అధికారులు, రిజర్వు బ్యాంకు గమనించాలి. కారణాలు అన్వేషించాలి. ఆరా తీయాలి. అవసరమైతే మిగతా శాఖలను అప్రమత్తం చేయాలి. ఎవరికివారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తుంటే చూస్తుండగానే మోసం విలువ రూ.వందల కోట్లకు చేరుకుంటుంది.
- ఇదీ చూడండి :
- బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!