CYBER CRIME: ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా... సైబర్ నేరగాళ్లు ఎదో రకంగా బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా... ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్మీ జవాన్లు, అత్యవసర బదిలీలు, ఆలిండియా డెలివరీ ఫ్రీ అంటూ కార్లు, మోటార్ బైక్ లను ఓఎల్ఎక్స్ వంటి సైట్ల ద్వారా అమ్మకాల పేరుతో కొత్త మోసాలు వెలుగుచూస్తున్నాయి. మీకు అలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటవెంటనే సమాచారం పంపుతూ తొందరపెట్టి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
మార్కెట్ ధర కంటే తక్కువకే ఆర్మీ క్యాంటిన్ ద్వారా వాహనం వచ్చిందని అందువల్లనే సెకెండ్స్ వాహనాన్ని అందరికంటే తక్కువ ధరకు అమ్ముతున్నామని వెబ్‌సైట్‌లో పెడుతారు. వారిని సమీపించిన వారికి ముందుగానే తయారు చేసుకున్న అన్ని రకాల నకిలీ ఆధారాలతో నమ్మబలికిస్తారు. ఆధార్, లైవ్ లోకేషన్ షేర్ చేయండి అంటూ తొందర పెడతారు. ఆలస్యం చేస్తే మంచి ఛాన్స్ కోల్పోతారంటూ ఓ చిన్నపాటి సంశయాన్ని కలిగిస్తారు. మీరు ఆ ధర కూడా తగ్గించమని అడిగితే నమ్మబలికేట్టుగా... తనకు ఆర్మీ క్యాంటిన్ వల్ల అంత కనిష్ఠ ధరకు ఇవ్వగలుగుతున్నామని... ఇక తగ్గించలేమని చెబుతూనే... కొంత మొత్తం తగ్గిస్తారు. పూర్తిగా మీరు నమ్మారన్న తర్వాతే... కొన్ని గంటలకు కారు లేదా బైక్ హోం డెలివరీకి బయలు దేరిందని లైవ్ లోకేషన్ అంటూ లింక్ షేర్ చేస్తారు. అది క్లిక్ చేశారో అంతే మీ ఖాతాలో డబ్బులు మాయం అయినట్లే.
ఈ ముఠా ఉత్తర ప్రదేశ్ నుంచి చాలా పకడ్బంధీగా ఆపరేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటి మూలాలు ఇంకా పట్టుబడకపోయినా... పలువురికి మాత్రం ఓఎల్ఎక్స్లో కారు అమ్మకం ప్రకటన తర్వాత ఇలాంటి వాట్సాప్ సందేశాలు వచ్చాయి. వీటిని పసిగట్టిన ఓఎల్ఎక్స్ సంస్థ తన వినియోగదార్లను హెచ్చరించి సదరు ప్రకటనను నిషేధించి ఉపసంహరించుకున్నట్టు సమాచారం పంపుతోంది. అయితే... ఈ తరహా మోసాలపై సైబర్ క్రైం పోలీసులు... తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.