సైబర్ నేరాలపై పోలీసుల నిఘా పెరుగుతుండటంతో నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొవిడ్ సమయంలో అత్యుత్తమ సేవలందించిన నటుడు సోనూసూద్ పేరును సైతం వాడుకుని దోపిడీకి పాల్పడ్డారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం చేసేందుకు మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించగా అతని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.60 వేలు లూటీ చేశారు.
గత సెప్టెంబర్‌లో బాధితుడు పేదలకు సహాయం చేసేందుకు గూగూల్‌లో సోనూసూద్ ఫౌండేషన్‌కు ఫోన్ నంబర్ కోసం వెతికాడు. అక్కడ కనిపించిన నంబర్‌కు ఫోన్ చేయగా పంకజ్ సింగ్ అనే వ్యక్తి అందుబాటులోకి వచ్చాడు. తాను రూ.10 వేల సహాయం చేద్దామనుకుంటున్నాని చెప్పగా... బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకున్నాడు.
రూ.60వేలు లూటీ..
అనంతరం సోనూసూద్ మరికొంత సహాయం చేయాలని కోరుతున్నారని... అందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.8,300 చెల్లించాలని సైబర్ నేరగాడు తెలిపాడు. వారి కుటుంబానికి రూ.3.60 లక్షలు అవసరం అని చెప్పగా.. అప్పటి నుంచి విడతల వారీగా రూ.60వేలు సైబర్ నేరగాడు చెప్పిన ఖాతాలో బాధితుడు జమ చేశారు. అయినా ప్రాసెసింగ్ కోసం మళ్లీ డబ్బు అడగగా బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.