కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. నేడు దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలు కనీసం 3 కేంద్రాల్లో డ్రైరన్ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు... హైదరాబాద్, మహబూబ్ నగర్‌లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక మహబూబ్ నగర్‌కి సంబంధించి జానంపేట పీహెచ్సీ, మహబూబ్‌నగర్ జీజీహెచ్, ప్రైవేట్ సెక్టార్లో నేహా షైన్ హాస్పిటల్లలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
డ్రైరన్ అంటే..
వ్యాక్సిన్ డ్రైరన్‌లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉండాలని.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో వుండే సమస్యలను గుర్తించి పరిష్కరించి... అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రైరన్ ప్రధాన లక్ష్యం. అయితే డ్రైరన్‌లో ఎక్కడా వ్యాక్సిన్ ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్‌గా మాత్రమే చేసి చూస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్లో అధికారులు పొందుపరచనున్నారు.
మహబూబ్‌నగర్‌లో సర్వం సిద్ధం
మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ డ్రైరన్‌కు సర్వం సిద్ధమైంది. డ్రైరన్‌లో పాల్గొనే 25మంది సమాచారాన్ని ఇప్పటికే టీకా ఆప్‌లో నిక్షిప్తం చేసి ఉంచారు. డ్రైరన్‌ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సహా.. కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే బృందాలు కూడా పర్యవేక్షించనున్నారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల అమలును.. డ్రైరన్‌లో తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు, ఆరడుగుల దూరాన్ని అందరూ పాటించాల్సిందే. ప్రతి కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్.. శానిటైజర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఇదీ చదవండి: