రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ లో ఉన్న రోగుల వివరాలను వారి బంధువులకు తెలిపేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారి కృష్ణబాబు స్పష్టం చేశారు. కొవిడ్ ఆస్పత్రుల్లో ఆహారం, మందులు, పరిశుభ్రత, నీటి సరఫరా తదితర అంశాలపై రోగుల నుంచి ఫిర్యాదులు సేకరించేందుకు 1092 కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 9 అంశాల్లో ఈ ఫిర్యాదులు స్వీకరించి సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 46 వేల 198 పడకలు కొవిడ్ కోసం ప్రత్యేకించినట్టు ఆయన వెల్లడించారు. వీటిని మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కృష్ణబాబు వివరించారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మరణాలు పెరగటం ఆందోళనకరమేనని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు. చికిత్సకు అవసరమైన వైద్య సిబ్బందిని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 800 మంది వైద్యులను అందించడానికి ముందుకు వచ్చిందని కృష్ణబాబు తెలిపారు.
కరోనా కారణంగా మరణించిన వారి అంత్యక్రియల నిర్వహణ ఇబ్బందిగా పరిణమించిందన్నారు. కరోనాతో మృతి చెందినవారి మృతదేహాలను ఖననం చేసేందుకు కుటుంబసభ్యులే ముందుకు రావడం లేదన్నారు. అయినా అంత్యక్రియలు గౌరవప్రదంగా, ప్రోటోకాల్ ప్రకారం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. కరోనా మృతుల అంత్యక్రియలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు వివాహాల లాంటి శుభ కార్యాలు అడ్డుకోవడం ప్రభుత్వ ఉద్దేశం కాదని... కేంద్రం ఇచ్చిన కొవిడ్ నిబంధనలు మేరకే వీటిని నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిని మీరితే పోలీసు చర్యలు ఉంటాయని కృష్ణబాబు స్పష్టం చేశారు.