సెలెక్ట్ కమిటీ ఏర్పాటు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. మండలి 154వ నిబంధన ప్రకారం తనకున్న విచక్షణాధికారంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని గత నెల 22వ తేదీన మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు.. సభలో పార్టీల సభ్యుల సంఖ్య బట్టి ఉంటుంది. బిల్లులకు సంబంధించిన శాఖల మంత్రులు ఈ కమిటీలకు ఛైర్మన్లుగా వ్యవహరించాలి. పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. సెలెక్ట్ సభ్యుల పేర్లు సూచించమని పార్టీలను ఛైర్మన్ కోరారు. వైకాపా మినహా తెదేపా, భాజపా, పీడీఎఫ్‌లు ఎమ్మెల్సీలు తమ సభ్యుల జాబితాను ఛైర్మన్‌కు అందించారు. ఈ జాబితాను ఛైర్మన్ మండలి కార్యదర్శికి పంపారు.
పురోగతి లేకపోతే బిల్లులు ఆమోదం : వైకాపా
154వ నిబంధన ప్రకారం సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మండలి కార్యదర్శి.. దస్త్రాన్ని ఛైర్మన్‌కు తిప్పి పంపారు. ఓటింగ్ జరగకుండా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమన్న కొత్త వాదనను వైకాపా తెరపైకి తెచ్చింది. మండలి వాయిదా అనంతరం 14 రోజుల పాటు బిల్లులు ఎలాంటి పురోగతి లేకుండా పెండింగ్‌లో ఉంటే ఆమోదయోగ్యంగా భావించాల్సి వస్తుందని అధికారపక్షం అంటుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దస్త్రాన్ని తనకు తిప్పి పంపిన కార్యదర్శి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శికి ఛైర్మన్ షరీఫ్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని మండలి కార్యదర్శికి దస్త్రం పంపినట్లు సమాచారం.
వికేంద్రీకణ, సీఆర్డీఏ...సాధారణ బిల్లులు : యనమల
శాసనమండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని తెలుగుదేశం స్పష్టం చేసింది. సెలెక్ట్ కమిటీలు ఏర్పాటైనట్లు ప్రభుత్వం న్యాయస్థానంలో ఒప్పుకున్న విషయాన్ని తెదేపా నేత యనమల రామకృష్ణుడు గుర్తుచేశారు. మనీ బిల్లు అయితే సెలెక్ట్ కమిటీకి వెళ్లటానికి వీల్లేదని, ఆ బిల్లులు మాత్రమే 14 రోజుల్లో ఆమోదయోగ్యంగా పరిగణించాల్సి ఉంటుందనే విషయాన్ని యనమల వెల్లడించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సాధారణ బిల్లులుగా ప్రవేశపెట్టి కనీస అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మండలి పూర్తిగా రద్దు కానప్పుడు.. సమావేశాలు నిర్వహించకుండా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందని ప్రశ్నించారు.
సీఎం వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు : తెదేపా
సీఎం జగన్‌పై వచ్చే శాసన మండలి సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెదేపా ఎమ్మెల్సీలు తెలిపారు. శాసన మండలిని కించపరిచేలా సీఎం వ్యవహరించారని ఆరోపించారు. అడ్డదారిన ఎమ్మెల్సీలు వచారన్న సీఎం వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లు ఉన్న మండలిపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరమని ధ్వజమెత్తారు. ఈ అంశంపై త్వరలోనే దిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో.. సెలెక్ట్ కమిటీ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఇదీ చదవండి:
'సెలెక్ట్ కమిటీ' విషయంలో మండలి కార్యదర్శిపై ఛైర్మన్ షరీఫ్ ఆగ్రహం