Tirumala Srivari Brahmotsavam Sarva Bhupala Vahanam : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో తిరుమాడ విధులలో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహన విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
సర్వభూపాల వాహనం - యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు.
రాజాధి రాజు శ్రీహరి
విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు. 'రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే' అని వేదాలలో వర్ణించినట్లుగా శ్రీహరి రాజాధి రాజు. సర్వ భూపాలుడు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కందాలపై మోస్తున్నారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవకు అంకితం కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ మానవాళికి ఇస్తోంది. సర్వ భూపాల వాహనంపై విహరించే శ్రీనివాసుని దర్శిస్తే కీర్తి, యశస్సు, పదవీయోగం కలుగుతాయని శాస్త్ర వచనం. సర్వ భూపాల వాహనంపై విహరించే శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.