తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో గడచిన దశాబ్దకాలంలో స్థిరాస్థి రంగం అన్ని విధాలా శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరం క్రమంగా విస్తరిస్తుండడం, కొత్త ఐటీ, ఫార్మా కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల ఏర్పాటుతో కార్యాలయాల స్థలానికి అవసరమైన డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
ఈ ఏడాది మార్చి వరకు గృహాల అమ్మకాలు, కొత్త నిర్మాణాలు యథావిధిగా సాగాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ స్థిరాస్తి రంగంపై తీవ్రంగా ప్రభావం చూపించింది. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోగా కొత్తవి మొదలు కావడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు స్తంభించడం వల్ల ఆ ప్రభావం ఆర్థిక వనరులపై తీవ్రంగా పడింది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిపోవడం స్థిరాస్తి రంగాన్ని కుదిపేసింది.
గృహ నిర్మాణంలో గతేడాది మొదటి ఆరు నెలల్లో 5, 430 యూనిట్లు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ఏడాది అదే సమయంలో 4వేల 422 యూనిట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ఇందులో కోటి నుంచి రెండు కోట్ల విలువ చేసే గృహాల కొనుగోళ్లకు 32 శాతం మంది మక్కువ చూపినట్లు తేలింది. 50లక్షల నుంచి 75లక్షలు విలువ చేసే ఇళ్లను కొనేందుకు 22శాతం, 75లక్షల నుంచి కోటి విలువైన ఇళ్లు కొనేందుకు 19శాతం కొనుగోలుదారులు చొరవ చూపినట్లు సర్వేలో తేలింది. 50 లక్షలకు లోపు విలువచేసే గృహాలు కొనన్నవారు 20 శాతమే ఉన్నట్లు పేర్కొంది.
గృహాల అమ్మకాలు పరిశీలిస్తే గతేడాది మొదటి ఆరు నెలల్లో 8, 334 అమ్ముడుపోతే.. ఈ ఏడాది అదే సమయానికి 43శాతం అమ్మకాలు పడిపోయాయి. 4,782 యూనిట్లే విక్రయాలు జరిగాయి. వీటిలో 50 లక్షల నుంచి 75లక్షల విలువ చేసే ఇళ్లు కొన్నవారు 28శాతం ఉంటే... కోటి నుంచి రెండుకోట్ల మధ్య విలువ చేసే ఇళ్లను కొనుగోలు చేసిన వారు 26శాతం ఉన్నారు.
50లక్షలు కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల కొనుగోలుదారులు 21శాతం నుంచి 17శాతానికి పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరలను పరిశీలిస్తే గతేడాది ధరలతో పోలిస్తే సగటున చదరపు అడుగు 4, 373 నుంచి 4, 673లకు ఎగబాకింది. గతేడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే... ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ధరలు ఏడు శాతం పెరిగినట్లు సర్వే స్పష్టం చేస్తోంది. లాక్‌డౌన్ పీరియడ్‌లో ఆ ధరలు అలాగే ఉన్నట్లు వెల్లడించింది.
అభివృద్ధి అంతా హైదరాబాద్ పశ్చిమం వైపే ఉండడం వల్ల ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో 59శాతం ఇళ్ల కొనుగోళ్లు అక్కడే జరిగాయి. మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, కొండాపూర్‌లోనే ఉన్నాయి. మెట్రో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలకు అందుబాటులోకి రావడం, రహదారుల విస్తరణపై ప్రభుత్వం దృష్టిసారించడం వల్ల శివారు ప్రాంతాల్లోనూ స్థిరాస్తి అభివృద్ధి కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ తూర్పు వైపు, ఉత్తరం వైపుల గృహనిర్మాణ రంగం క్రమంగా విస్తరిస్తోంది.
ఇదీ చూడండి: డిసెంబరు కల్లా కొవిడ్-19 వ్యాక్సిన్!