పల్లెల్లో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఏదైనా ఒక గ్రామంలో పాజిటివ్ కేసు నమోదైందని తెలిస్తే చాలు... అక్కడికి కూలీలు ఎవరూ పనులకు రావడంలేదు. తమకూ వస్తుందేమో అనే భయంతో ఊళ్లో వాళ్లే కాదు.. పక్క ఊరి వాళ్లూ ఆవైపు చూడటంలేదు. దీంతో కూలీలు దొరకక పంట కోతలు నిలిచిపోతున్నాయి. ఇతర వ్యవసాయ పనులకూ ఆటంకం కలుగుతోంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా విస్తరిస్తుందో.. ఫలానా ఊళ్లో వాళ్లకు కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా అంతకు మించి వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుత ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. రాయలసీమలో వేరుసెనగ 18.75 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తొలకరి ఆరంభంలో వేసిన పైరు.. కొన్నిచోట్ల కోత దశకు చేరింది. కూలీలు దొరక్కపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు ఏర్పాటు చేసి.. అధిక కూలి ఇచ్చి కోతలు కోయిస్తున్నారు. చిరుధాన్యాల్లో సజ్జ కూడా కోతకు సిద్ధంగా ఉంది. కంకులు కోయించాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు తక్కువగా ఉన్నా.. అడపాదడపా పడిన వర్షాలకు 75వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. కొన్నిచోట్ల కంకి కోత దశకు చేరింది. ఒకవైపు ధరల్లేవు. కండె రూ.1 చొప్పున కూడా కొనడం లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. కూలీలు రాకపోవడంతో పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరినాట్లు మొదలయ్యాయి. మొత్తం 37.42 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి... ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఏటా పశ్చిమబెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర నుంచి వేలాదిగా కూలీలు నాట్లు వేయడానికి వచ్చేవారు. ఈ ఏడాది వారు రాకపోవడంతో కొన్ని చోట్ల వెదజల్లు విధానంలో, మరికొన్ని చోట్ల మెట్ట వరి వేస్తున్నారు. కోస్తాలో పత్తిలో కలుపుతీతలు, మిరపనాట్లకు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయేరోజుల్లో వరి కోతలు, పత్తి తీతలు, మిరప కోతలు ముమ్మరమైతే.. ఏం చేయాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం జిల్లా సాలూరు మండలం దుద్దిసాగరంలో రోజూ 400 నుంచి 500 మందికి పని దొరికేది. ఇటీవల ఇక్కడ ఒకరికి వైరస్ సోకింది. అంతే.. అప్పట్నుంచి ఇతర గ్రామాల నుంచి కూలీలు రావడం మానేశారు. ఇప్పుడు పిలిస్తే 10 నుంచి 20 మంది కూలీలు కూడా రావడం లేదు. మొక్కజొన్న కోతలు ఆగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో మొక్కజొన్న, టమోటా సాగు అధికం.‘ ప్రస్తుతం కొన్నిచోట్ల మొక్కజొన్న పడిపోయింది. గడ్డి మొలుస్తోంది. వానల్లేకపోవడంతో కొంత నయం.. ఏ మాత్రం జల్లులు పడినా కాండంలో నీరు పోసుకుని మొత్తం నేల కరుస్తోంది’ అని రైతు గోవిందరావు వివరించారు. ‘ పనికి వెళ్దామంటే భయమేస్తోంది. మహిళలను కూడా పోవద్దని ఆపేశాం.. వారం నుంచి ఆదాయం లేదు. అయినా ఏం చేస్తాం’ అని పుల్లేరుగడ్డకు చెందిన లక్ష్మణ పేర్కొన్నారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజుపాలెం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘సకాలంలో వర్షాలు కురిసినా.. కూలీలు రాకపోవడంతో సరైన సమయానికి నాట్లు వేయలేకపోయాం. చివరికి వెదజల్లు విధానాన్ని ఎంచుకున్నాం. అదీ సరిగా మొలవలేదు. పంట కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.
* చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం తిమ్మసముద్రంలో ఒకే రోజు 16మందికి పాజిటివ్ వచ్చింది. ‘పూల చెట్లలో కలుపులు తీద్దామని పిలిస్తే ఎవరూ రావడం లేదు. సజ్జ కోత కూడా ఆగింది. కొంత మంది వేరుసెనగ పీకలేకపోయారు’ అని ఈ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చెప్పారు. ‘రాయపేడులో ఒకరికి కరోనా వచ్చింది. ఊళ్లో కూలీలు మేం పనికి రాలేమని చెప్పారు. చుట్టుపక్కల వాళ్లూ రావడం లేదు. పిచ్చాటూరు మండలం నుంచి ఒక్కొక్కరికి రోజుకు రూ.150 చొప్పున ఇచ్చేలా కూలీలను తెచ్చి కోత కోయించాం. వారికి రావడానికి, పోవడానికి ఆటోకు రూ.600 అయ్యాయి. అదే స్థానిక కూలీలైతే రోజుకు రూ.120 మాత్రమే, ఆటో ఖర్చులూ ఉండవు’ అని మరో రైతు వివరించారు.
ఇదీ చదవండి: 'ప్రజల కోసం పోరాడుతున్నారనే కేసులు పెట్టారు'