గుంటూరు జిల్లాలో ఒక్కరోజులోనే 424 కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 242 కేసులు నమోదు కావడం పరిస్థితికి నిదర్శనం. తెనాలి 24, పిడుగురాళ్ల 22, తాడేపల్లి 17, దాచేపల్లి, మాచర్ల 14, చిలకలూరిపేట 13, సత్తెనపల్లి 9, ప్రత్తిపాడు, వినుకొండలో 8 కేసులు చొప్పున బయటపడ్డాయి. మిగిలిన మండలాల్లోనూ 2, 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 8 మంది మరణించారు. కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం ఆంక్షలు జారీచేసింది. ఉదయం 6 నుంచి 11గంటల వరకే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్‌కు కరోనా సోకినందున కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది.
కృష్ణాజిల్లా, నాగాయలంకలో వస్త్రదుకాణం నిర్వహిస్తున్న కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలగా ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిస్థితిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్.... రామానగరం దళితవాడలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు 20వేల విలువైన శానిటైజర్లు, N-95మాస్కులు, ఫేస్ షీల్డ్‌లు అందచేశారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు ఇవాళ నిలిపేశారు. జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితాలు రావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రోజుకు 20 కేసులుపైనే నమోదు కావడం బెంబేలెత్తిస్తోంది. శనివారం ఒక్కరోజే పట్టణంలో 6, అత్తిలి 6, ఇరగవరం మండలంలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఎస్పీ నారాయణ నాయక్ వారి కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో కొవిడ్ నిబంధనలు పాటించని పలు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. మరికొన్ని దుకాణాలకు జరిమానా విధించారు. ధర్మవరంలో కేసులు పెరుగుతున్నందున పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు సమావేశం నిర్వహించారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న పట్టు చీరల మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. గుంతకల్లులోని హోల్ సేల్ దుకాణాలను స్వచ్ఛందంగా వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు వ్యాపార సంఘం నేతలు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో శనివారం ఒక్కరోజే 343 కేసులు నమోదు కావడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. తిరుపతిలో శనివారం ఒక్క రోజే 256 కేసులు నమోదయ్యాయి. విష్ణు నివాసాన్ని ఇవాళ్టి నుంచి కొవిడ్ సెంటర్‌గా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
విశాఖ జిల్లా పాడేరు మన్యంలో వైరస్ వ్యాప్తితో 70 మందికి పరీక్షలు జరిపారు. వారిలో ముగ్గురికి వైరస్ సోకినట్లు గుర్తించారు. పెదబయలు మండలం సిరసపల్లి, పుట్టకోటలో ఇద్దరు, హుకుంపేట మండలం చిట్టెంపాడులో ఒకరికి కరోనా సోకింది. డుంబ్రిగుడ, అరకులోయలోనూ ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మన్యంలో ప్రస్తుతానికి 17 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రోజుకు 4 వేల పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో కొవిడ్ సామాజిక వ్యాప్తి అధికంగా ఉందున్న ఆయన... ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: