పీఏసీఎస్‌లకు 2013 జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. 2018 జనవరి, ఫిబ్రవరితో వీరి పదవీకాలం పూర్తయింది. తరవాత వారికి ఆరు నెలల చొప్పున.. విడతల వారీ కొనసాగింపు ఇచ్చారు. 2019 జులై తరవాత పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీలను నియమిస్తూ.. ఆరు నెలలకోసారి పొడిగింపు ఇస్తున్నారు. ఇటీవలే వీరి పదవీ కాలం పూర్తయింది. మళ్లీ కొనసాగించేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో... డీసీసీబీలకు జిల్లా సంయుక్త కలెక్టర్లను, పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్ ఇన్‌ఛార్జిలను ఆరు నెలల కాలానికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తే.. రాజకీయ ఒత్తిళ్లు కూడా అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు అధికారవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే మొదలైన కసరత్తు
సహకార ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం నెలన్నర వ్యవధి అవసరం అవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కసరత్తు మొదలైంది. సంఘాల్లో సభ్యుల వారీగా.. 21 అంశాలతో కూడిన వివరాలు తయారు చేయిస్తున్నారు. పీఏసీఎస్‌లో రూ.300 షేరుధనంపైన ఉన్న వారే ఓటు హక్కు కలిగి ఉంటారు. గతేడాది సమాచారం ప్రకారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64.59 లక్షల మంది సభ్యులున్నా ఇందులో ఓటు వేసేందుకు అర్హులైన వారు 34.90 లక్షల మందే. తాజా జాబితాల్లో మరెంతమంది పెరుగుతారో, తగ్గుతారో తేలాల్సి ఉంది.
సభ్యులు తీసుకున్న బాకీ వాయిదా.. సంవత్సరం దాటి ఉంటే అలాంటి వారూ ఓటు హక్కు కోల్పోయినట్లే అవుతుంది. రెండేళ్లలో రూ.5వేలు, ఆరు నెలల్లో రూ.10వేల మేర డిపాజిట్లు ఉన్న సభ్యులకూ ఓటు హక్కు ఉంటుంది. నిబంధనల మేరకు జనవరి నెలాఖరు నాటికి అర్హులైన ఓటర్ల వివరాలతో జాబితాలను తయారు చేసి పంపాలని ఇప్పటికే సహకారశాఖ నుంచి పీఏసీఎస్‌ల అధికారులకు ఆదేశాలు అందాయి. రెవెన్యూ గ్రామాల వారీగా కూడా జాబితాలను రూపొందించాలని సూచించారు. ఈ మేరకు పలుచోట్ల జాబితాల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: సీడ్‌యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం