కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, అప్పటి ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరిలకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు పనిగంటలు ముగిసే వరకు కోర్టు హాలులోనే ఉండాలని ఆదేశించింది. దాంతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. తొమ్మిది నెలలపాటు హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యానశాఖ విలేజ్ హార్టీకల్చర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. ఎంపిక ప్రక్రియ మధ్యలో ఉండగా..నిబంధనలు మార్చడంతో అనర్హతకు గురయ్యామని 36 మంది అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, పిటిషనర్లకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంది. 2020 సెప్టెంబరు 9న ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తాజా విచారణకు ఇరువురు అధికారులు కోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు తీర్పు మేరకు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి సాయంత్రం 5గంటల వరకు కోర్టుహాలులోనే ఉండి శిక్ష అనుభవించారు.
ఇదీచదవండి.