Contractors on Pending Bills: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు-నేడు కింద పాఠశాలల అభివృద్ది, ఇతర భవనాల సముదాయాల నిర్మాణాల పనులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, పురపాలికల్లో అనేక మంది గుత్తేదారులు.. అప్పులు తెచ్చి మరీ సకాలంలో పనులు పూర్తి చేశారు. చేపట్టిన నిర్మాణాలపై ప్రకటనలతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం.. గుత్తేదారులకు మాత్రం బిల్లులు చెల్లించలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండటంతో కాంట్రాక్టర్లు క్రమక్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు కట్టలేక కొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కేంద్ర ఆర్ధిక శాఖ అధికారుల్ని కలిసిన గుత్తేదారులు.. కేంద్రం వాటా నిధులైనా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం వాటా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో మంజూరు చేసినట్లు అధికారులు చెప్పడంతో గుత్తేదారులు అవాక్కయ్యారు. గవర్నర్‌ను కలిసి తమ పెండింగ్ బకాయిల్ని ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. దాదాపు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించకపోగా కేంద్రం వాటా నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడాన్ని గుత్తేదారులు తప్పుబడుతున్నారు. తెచ్చిన అప్పులకు ఏళ్ల తరబడి వడ్డీలు కట్టలేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామని, మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: