EMPLOYEES PROTEST AT COLLECTORATES : అసంఘటితరంగ కార్మికుల ఆందోళనలతో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు దద్దరిల్లాయి. ప్రభుత్వ శాఖల్లోని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ.. కడప కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ధర్నాల్లో పాల్గొన్నారు. చాలీచాలని వేతనాలు కూడా సమయానికి.. రావడం లేదని రోడ్డుపై బైఠాయించారు. కనీస వేతనాలు 26 వేల రూపాయలు చేయాలని.. సీఐటీయూ ఆధ్వర్యంలో.. అనంతపురం సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ.. ర్యాలీ చేశారు. జగన్‌ను నమ్ముకుని చిప్పే మిగిలిందంటూ కొబ్బరి చిప్పలు మెడకు తగిలించుకొని, ఉరితాళ్లతో నిరసన తెలిపారు.
విశాఖలో సరస్వతి పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ చేశారు. వెంటనే.. కనీసవేతనాల బోర్డు ఏర్పాటు చేసి.. రూ.26వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరకులు, ఇతర ధరల విపరీతంగా పెరిగాయన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పోలీసుల ప్రతిఘటన మధ్యే ఐటీడీఏ పీవోకు వినతి పత్రం ఇచ్చారు.
పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఏలూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఆశా కార్యకర్తలు , మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, ఉపాధిహామీ ఫీల్డ్ ఆఫీసర్లు, ఐకేపీ, వీఓఏలు.. ప్రభుత్వ పాఠశాల్లో పని చేస్తున్న ఒప్పంద క్రాఫ్ట్ ఉపాధ్యాయులూ పాల్గొన్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఇవీ చదవండి: