ఆంధ్రప్రదేశ్ భాజపా వ్యవహారాల బాధ్యునిగా కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, సహ బాధ్యునిగా సునీల్ దేవధర్ మరోసారి నియమితులయ్యారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల బాధ్యులను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా జారీ చేసిన జాబితాను శుక్రవారం విడుదల చేశారు.
ఏపీకి చెందిన పురందేశ్వరిని ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆమెకు అల్పసంఖ్యాక వర్గాల మోర్చా ఇన్‌ఛార్జిగానూ బాధ్యతలు అప్పగించారు. సత్యకుమార్‌ను అండమాన్ నికోబార్ దీవుల బాధ్యునిగా, ఉత్తరప్రదేశ్ సహ బాధ్యునిగా నియమించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో భాజపా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు సహ బాధ్యునిగా సత్యకుమార్‌ను నియమించడం విశేషం. ఇప్పటివరకు త్రిపుర బాధ్యునిగా ఉన్న సునీల్ దేవధర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఉన్న కేంద్ర మంత్రి మురళీధరన్ ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా దృష్టిసారించలేదు. తెలంగాణలోని దుబ్బాకలో భాజపా గెలుపు నేపథ్యంలో ఇకపై మురళీధరన్ ఏపీపై దృష్టి సారిస్తారని భాజపా ముఖ్య నేత ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: దీపకాంతులతో సుందరంగా ముస్తాబైన ఆలయాలు