ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పాఠశాల విద్యా ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) ప్రకారం అర్హులైన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో అమలు కావడం లేదని న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ఈ ఏడాది జనవరి 3న ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి చట్ట నిబంధనలను అమలు చేస్తామంటూ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ వేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకొని సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తీర్పు అమలు చేయకపోవడంతో న్యాయవాది యోగేష్ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు.
ఇదీ చదవండి: