నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగిన కారణంగా.. నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కరోనాతో పూర్తిగా స్తంభించి.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని ఈ పరిణామాలు కుంగదీస్తున్నాయి. ఈ భారం వినియోగదారులపైనే పడటంతో.. చాలామంది సొంతింటి కలను వాయిదా వేసుకుంటున్నారు. ఉక్కు, సిమెంటు, ఇసుక, వైరింగ్ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.200 వరకు పెరిగిందని భవన నిర్మాణదారులు చెబుతున్నారు.
సిమెంటుదీ అదే దారి: రెండు మూడు నెలల్లో సిమెంటు ధరలూ భారీగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్ల సిమెంటు ధర గతంలో బస్తా (50 కిలోలు) రూ.300 ఉంటే ఇప్పుడు రూ.400కి చేరింది. మీడియం బ్రాండ్లయితే రూ.230 నుంచి రూ.300కి చేరింది. సిమెంటు ఉత్పత్తిదారులు కలసి ధరలు పెంచేయడం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితులకు కారణమని నిర్మాణరంగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో సిమెంటు ధరలు పెరిగినప్పుడు... ప్రభుత్వం జోక్యం చేసుకునేది.
ఇసుక.. చెప్పాల్సిన పనే లేదు: ఇసుక సమస్య ఎప్పటినుంచో తీరడం లేదు. గతంలో రూ.6వేలకు వచ్చే 18 టన్నుల ఇసుక ఇప్పుడు రూ.17 వేలకు చేరింది. అదీ తగినంత.. కావల్సినప్పుడు దొరకడం లేదని విజయవాడలోని పోరంకి ప్రాంతానికి చెందిన ఒక బిల్డర్ పేర్కొన్నారు. ఉక్కు, సిమెంటు, ఇసుకతో పాటు, వైరింగ్ సామగ్రి, సీవీసీ, సీపీవీసీ ధరలూ 20 శాతం వరకు పెరిగాయని ఆయన తెలిపారు.
రెండు నెలల్లో రూ.20 వేలు
ఉక్కు ధరలు గత 15 ఏళ్లలో కనీవినీ ఎరగని రీతిలో పెరుగుతున్నాయి. జులై నుంచి ఇప్పటికి 55 శాతం పెరిగాయి. విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసే 8 ఎం.ఎం. రాడ్ల ధర విజయవాడ మార్కెట్లో టన్ను రూ.70 వేలకు చేరింది. అదే ఉక్కు ధర గత నవంబరు 15న రూ.49,800 ఉంది. స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్ (సింహాద్రి టీఎంటీ) సంస్థ ఉత్పత్తి చేసే 8 ఎం.ఎం. చువ్వల ధర విజయవాడ మార్కెట్లో నవంబరు 15న రూ.45,800 ఉంటే, గురువారం రూ.64,500కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
* కరోనాతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింది. ఇళ్లు కొనేవారిలో చాలామంది ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకొస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న దశలో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం ఈ రంగాన్ని దెబ్బతీస్తోంది.
* చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టినవారు.. పెరిగిన వ్యయాన్ని భరించలేక వాటిని ఆపేస్తున్నారు. ఫలానా సమయానికి ఫ్లాట్లు కట్టి ఇస్తామని చెప్పి, అడ్వాన్సులు తీసుకున్నవారు తప్పనిసరై కొనసాగిస్తున్నారు.
* ఒక చదరపు అడుగు నిర్మాణానికి 2.75 కిలోల నుంచి 3 కిలోల వరకు ఉక్కు అవసరం. 50 ఫ్లాట్ల అపార్ట్మెంట్ నిర్మాణానికి సుమారు 10 వేల బస్తాల సిమెంటు అవసరమవుతుందని అంచనా.
* నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ప్రాజెక్టుల్లో పెట్టుబడులు నిలిచిపోతాయని, ఇల్లు కొనాలనుకున్నవారు ఇంకా ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తారని నిర్మాణరంగ వర్గాలు చెబుతున్నాయి.
ధరల నియంత్రణకు కమిటీ వేయాలి
సిమెంటు, ఉక్కు ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలి. ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి.- సుధాకర్, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇది ఎవరికీ మంచిది కాదు
ఇప్పుడున్నవి అసాధారణ ధరలు. అవింకా పెరుగుతాయే తప్ప, ఇప్పట్లో తగ్గేలా లేదు. ఉక్కు ధరలు ఇంతగా పెరగడం మంచిది కాదు. కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఇనుప ఖనిజం, ఉక్కు ఎగుమతుల్ని నియంత్రించాలి. దేశీయ పరిశ్రమల అవసరాలకు సరిపడా ఇనుప ఖనిజం లభించేలా చూడాలి. ఎన్ఎండీసీ ధరలనూ సాధారణ స్థాయికి తీసుకురావాలి.- వి.వి.కృష్ణారావు, డైరెక్టర్,స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్
ఉక్కు ధర పెరుగుతోందిలా..
* అంతర్జాతీయ మార్కెట్లో గతంలో 397 డాలర్లు ఉన్న టన్ను ఉక్కు ధర ప్రస్తుతం 750 డాలర్లకు పెరిగింది. మూడు నెలల క్రితం 300 డాలర్లు ఉన్న టన్ను ఐరన్ స్క్రాప్ ధర ప్రస్తుతం 480 డాలర్లకు చేరింది. ఫిగ్ ఐరన్ ధర 330 డాలర్ల నుంచి 480 డాలర్లకు పెరిగింది.
* భారత్ నుంచి ఇనుప ఖనిజం, ఉక్కు ఉత్పత్తుల దిగుమతులను చైనా భారీగా పెంచేసింది.
* డిమాండ్ పెరగడంతో గనుల యజమానులూ ఇనుప ఖనిజం ధరలను పెంచేశారు. ఎన్ఎండీసీ సరఫరా చేసే ఇనుప ఖనిజం బేసిక్ ధర సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో టన్ను రూ.3 వేలు ఉండగా ఇప్పుడది రూ.6,600కి చేరిందని విశాఖకు చెందిన ఒక ప్రైవేటు ఉక్కు కర్మాగారం ప్రతినిధి తెలిపారు. పన్నులు, రవాణా ఛార్జీలు కలిపి టన్ను రూ.9 వేలకు చేరుతోందని చెప్పారు.
* విదేశాల్లో డిమాండ్ పెరగడంతో పాటు.. దేశీయంగానూ కరోనాతో మందగించిన నిర్మాణ ప్రాజెక్టులు మళ్లీ మొదలవడం, రవాణా రంగం కూడా పుంజుకోవడంతో ఉక్కుకు గిరాకీ ఏర్పడిందని, ధరల పెరుగుదలకు అదే కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
* ఉక్కు ధరలపై ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫిమి) మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఇనుప ఖనిజం ఎగుమతులను ఆరు నెలలు నిషేధించాలని ప్రధాని కార్యాలయానికి ఐఏఎస్ఏ ఇటీవల ఒక లేఖ రాసింది. దాన్ని ఫిమి ఖండించింది. ఉక్కు ధరల పెంపును సమర్థించుకోవడానికి ఐఎస్ఏ విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని, అంతర్జాతీయ ధరలతో సమానంగా ఇక్కడ ఉక్కు ధరలు పెంచేశారని, ఇనుప ఖనిజం ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే మన దగ్గర తక్కువ ఉన్నాయని ఫిమి పేర్కొంది.
ఇదీ చదవండి:
ఆ గుడిలో మహిళలు అడుగుపెట్టరు... పొంగళ్లు కూడా మగవారే చేస్తారు