సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి కూడా ఘోర పరాభవం తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెరాసకు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనబడుతోంది. ఒకప్పుడు గ్రేటర్ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్.. తాజాగా ఎన్నికల్లోనూ కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక చూసినా, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్‌లో కాంగ్రెస్ కళ మసకబారడానికి కారణాలేంటి?
సీన్ రివర్స్ అయిందిలా..
2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 149డివిజన్లలో పోటీచేసిన కాంగ్రెస్ 53 స్థానాలు గెలిచి ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీన్ రివర్స్ అయింది. దీంతో 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే (పటాన్‌చెరు, నాచారం) పరిమితమైపోయింది. ఈసారి ఏ పార్టీతో పొత్తులేకుండా కదనరంగంలోకి దూకిన కాంగ్రెస్.. మొత్తం 146 చోట్ల అభ్యర్థులను దింపి మళ్లీ రెండు కేవలం స్థానాలే గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను నిలుపుకోలేని ఆ పార్టీ కొత్తగా ఏఎస్‌రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో విజయం సాధించింది. తెలంగాణలో తెరాసకు తామే గట్టిపోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. ఆ స్థాయిలో పనితీరు కనబరచలేకపోతున్నారు. దీంతో ఆ స్థానాన్ని కమలనాథులు ఆక్రమించారు. తెరాసకు తామే అసలు సిసలైన ప్రత్యామ్నాయమంటూ చెబుతోన్న భాజపా.. దుబ్బాకలో ‘కమల వికాసం’తో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విజయం భాజపాకు ఓ టానిక్‌లా పనిచేయడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో కదనరంగంలోకి దూకి గతంలో కన్నా మెరుగైన స్థానాల్లో దూసుకెళ్తోంది.
ఆకట్టుకోని హామీలు.. రిపీటైన పరాభవం!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండోసారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటలేకపోయిన కాంగ్రెస్.. ఈసారైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దిగింది. మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, వరద సాయం రూ.50వేలు ఇస్తామంటూ పలు హామీలను మ్యానిఫెస్టోలో ప్రకటించినా అవేవీ నగర ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. హైదరాబాద్ అభివృద్ధిలో తమ పార్టీదే కీలక పాత్ర అని, తెరాస- భాజపా దొందూదొందే అంటూ చేసిన ప్రచారం కూడా ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికలకు సమాయత్తం చేసినా మరోసారి ఆ పార్టీకి ఘోర పరాభవమే రిపీటైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉన్నప్పటికీ సరైన ప్రచార వ్యూహాలు లేకపోవడంతో గతంలో గెలిచిన ఆ రెండు స్థానాల్లో పట్టు నిలుపుకోలేకపోయింది. పార్టీ నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, సంస్థాగత సమస్యలు కాంగ్రెస్‌కు శాపంగా మారాయని చెప్పొచ్చు. దీనికితోడు పటిష్ఠ నాయకత్వం కొరత, జాతీయ స్థాయి నాయకత్వంలోనూ అస్పష్టత ప్రజలనే కాదు.. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయనడంలో అతిశయోక్తి కాదు.
గ్రేటర్‌లో పార్టీని వీడిన కీలక నేతలు
హైదరాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్‌కు కీలక నేతలు లేకపోవడం కూడా వైఫల్యానికి మరో కారణమని చెప్పొచ్చు. గతంలో ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరడం. అలాగే, మేయర్‌గా పనిచేసిన బండా కార్తిక రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, విక్రమ్ గౌడ్ వంటి కొందరు నేతలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు సాధించిన నేతలు గెలిచాక తెరాసలో చేరుతారనే ప్రచారం కూడా కొన్నిచోట్ల ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009లో మేయర్‌గా ఉన్న బండా కార్తీక రెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉన్న విక్రమ్‌గౌడ్ ఇటీవల భాజపాలో చేరిన విషయం తెలిసిందే.
ప్రచారానికి దూరంగా అగ్రనేతలు
తెరాస, భాజపా అగ్రనేతలను ప్రచార బరిలోకి దించి హైదరాబాద్‌లో రాజకీయ కాక పుట్టించాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రచారం నిర్వహించడంలో విఫలమైంది. భాజపా తరఫున అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాశ్ జావడేకర్‌తో పాటు కిషన్‌రెడ్డి, యోగి ఆదిత్యనాథ్ వంటి కీలక నేతలు ప్రచారం నిర్వహించినా.. కాంగ్రెస్ అగ్రనేతలెవరూ ప్రచారం చేయలేదు. ఈ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇలా కొందరు నేతలు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడం కూడా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీ ఫలితాలు: 48 స్థానాల్లో భాజపా గెలుపు