తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల నర్సింగరావు కరోనాతో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. బూర్గుల మృతి పట్ల మంత్రి కేటీఆర్, సీపీఐ నేతలు నారాయణ, సురవరం సుధాకర్‌రెడ్డి, సాంబశివరావు, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
తీరని లోటు
తెలంగాణ ఉద్యమంలో నర్సింగరావు సైనికుడిగా నిలబడ్డారని నారాయణ కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధిలో పెద్దదిక్కుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. నర్సింగరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చిరస్మరణీయం
విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు బూర్గుల నర్సింగరావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం తొలిదశ నుంచి మలిదశ దాకా పోరాడారని పేర్కొన్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బూర్గుల సేవలు చిరస్మరణీయమైనవని వెల్లడించారు.
ఇదీ చదవండి: తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ