కరోనా థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించే అంశాలపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని నేతృత్వంలో కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, సిదిరి అప్పలరాజు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. పీడియాట్రిక్ వైద్య సేవలందించేందుకు అదనంగా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పీడియాట్రిక్ సేవలందించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది.
జనావాసాలకు దగ్గరగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేసే అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లోనూ ఆవకాశం ఉన్నచోట్ల పిల్లలకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రుల కమిటీ ఆదేశించింది. థర్డ్ వేవ్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ జరిగితే కఠినంగా వ్యవహారించాల్సిందిగా సూచించింది.
ఇదీ చదవండీ... mansas trust: రెండేళ్లలో ఎన్నో అలజడులు సృష్టించారు: అశోక్‌గజపతిరాజు