Protest: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పునర్‌వ్యవస్థీకరణ పేరుతో జరుగుతున్న అధికారాల వికేంద్రీకరణ, పారదర్శకత లేని బదిలీల తీరును ఖండిస్తూ బుధవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో మార్పు రాకుంటే ప్రత్యక్ష ఆందోళన నిర్వహించేందుకు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేసింది.
పునర్‌వ్యవస్థీకరణ, బదిలీల నిర్వహణ తీరుపై విజయవాడలో మంగళవారం సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలోని నలుగురు అధికారుల సంకుచిత నిర్ణయాలు, విలన్ పాత్ర పోషిస్తుండడం వల్ల పునర్‌వ్యవస్థీకరణ గందరగోళంగా మారిందని మండిపడ్డారు. ఈ శాఖలో జరుగుతున్న పరిణామాలు, అవకతవకలు, బదిలీల పేరుతో వ్యాపారం, రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై సీనియర్ ఐ.ఎ.ఎస్.తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని సమీక్షించే వరకు తదుపరి చర్యలు నిలిపేయాలని స్పష్టం చేశారు.
‘పునర్‌వ్యవస్థీకరణ చర్యలు, బదిలీల నిర్వహణను బహిష్కరిస్తూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఈ మేరకు ఉన్నతాధికారులకు బుధవారం లిఖితపూర్వకంగా తెలియచేస్తాం. పునర్‌వ్యవస్థీకరణ జీఓ 419 అర్థరహితంగా ఉంది. అయిదంచెల పదోన్నతులతో ఉన్నత స్థానాలకు వెళ్లిన వారు కింది స్థాయి అధికారాలు ఎందుకు కావాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
డీలర్ల సమాచార వెల్లడిలో గోప్యత పాటిస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరొక ప్రాంతానికి బదిలీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ విషయం కూడా అధికారులకు తెలియదా? సీఎం కార్యాలయం నుంచి పరిశీలన చేయాలని అధికారులకు ఉత్తర్వులు వెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. బదిలీలకు ఆప్షన్లు అడగడం ఏమిటి? ఓపెన్ మెరిట్ విధానంలో వరుస క్రమాన్ని ప్రకటించి అందరి సమక్షంలో ఎందుకు చేపట్టరు? రహస్యంగా చేపట్టడం ఎవరి కోసం? రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో ఏర్పాటైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం ఏమిటి? రెగ్యులర్ ప్రిన్సిపల్ కార్యదర్శి లేరు? రకరకాల కారణాలతో ఆర్థిక మంత్రి అందుబాటులో ఉండని పరిస్థితి..’ అని సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ వివరించారు.
నిరసన కార్యక్రమాలిలా.. స్టేషన్ కాకుండా ఆఫీస్ ప్రతిపాదికన బదిలీలు జరపాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఎం.రమేష్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త కార్యాలయాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయకుండా వాటికి ఉద్యోగులను బదిలీ చేయడం అర్థం లేని చర్యగా పేర్కొన్నారు. కార్యాలయాలు ప్రారంభమైన అనంతరమే ఉద్యోగులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
13న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు, 14 నుంచి 18 వరకు కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన విరామంలో ధర్నా, 19, 20 తేదీల్లో డివిజన్, 22న కమిషనర్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాలను’ నిర్వహిస్తామని వివరించారు.
తీర్మానాల్లో ముఖ్యమైనవి.. బదిలీలను పునర్‌వ్యవస్థీకరణతో సంబంధం లేకుండా నిర్వహించాలి. లేదంటే.. పునర్‌వ్యవస్థీకరణను ముందుగా చేపట్టి, ఆ తర్వాత బదిలీలు చేపట్టాలి.
- సజావుగా జరిగేలా అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేసి చర్చించాలి.
- బదిలీల ప్రక్రియను ఉద్యోగులు బహిష్కరించాలి. ఆప్షన్స్ ఇవ్వకూడదు.
- ఏర్పాటు చేసిన కమిటీలు రద్దు చేయాలి. కొనసాగించే పక్షంలో అసోసియేషన్ ప్రతినిధికి అన్ని స్థాయిల కమిటీల్లో ప్రాతినిథ్యం కల్పించాలి.
ఇవీ చూడండి: