ys jagan review on agriculture: సాగులో విచక్షణారహితంగా ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని, ఇందుకు క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రతి రైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డుల్ని ఇవ్వాలన్నారు. 'సాగు చేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలనే విషయమై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఏటా ఖరీఫ్, రబీ ముగిశాక భూసార పరీక్షలు చేసే కార్యక్రమం అందుబాటులోకి తేవాలి' అని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 'రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు సమర్ధంగా సాగాలంటే.. వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, విపత్తుల నిర్వహణ శాఖల మధ్య సమన్వయం అవసరం. సంబంధిత శాఖల అధికారులు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ఇందుకు అనుగుణంగా మార్గదర్శక ప్రణాళిక తయారు చేసుకోవాలి' అని చెప్పారు.
ధాన్యం కొనుగోలులో గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులు: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో.. గ్రామ సచివాలయాల్లోని మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలని, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 'ఖరీఫ్ పంటల కొనుగోలుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. కనీస మద్దతు ధర కంటే పైసా కూడా తగ్గకూడదు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. ఆర్బీకే స్థాయిలోనే ధాన్యం నాణ్యత పరీక్షలు జరగాలి. అక్కడే వేబ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. మోసాలు, అక్రమాల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి' అని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, సీఎస్ సమీర్‌శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్, సి.హరికిరణ్, ప్రద్యుమ్న, వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మడమ తిప్పిన రాష్ట్ర సర్కార్.. తిరిగి ఫసల్ బీమా యోజన అమలుకు నిర్ణయం
'ఒత్తిడిని తట్టుకుని సింధు అద్భుతంగా ఆడింది.. తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం'