కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సహా పలు అంశాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా విస్తరణ, కొత్తగా నమోదైన కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు అందించారు. కొత్త కేసుల్లో చాలామంది దిల్లీ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చారన్న అధికారులు.. రాష్ట్రం నుంచి వెళ్లినవారి వివరాలు సేకరించామని తెలిపారు. కొందరిని క్వారంటైన్‌కు, మరికొందరిని ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై అధికారులతో మాట్లాడిన సీఎం జగన్... దిల్లీ వెళ్లినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చికిత్స తీసుకోవాలని కోరారు. వైద్యశాఖ, పోలీసులు వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
అనంతరం జనరద్దీ ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాల్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం సమీక్షించారు. విదేశాలకు వెళ్లివచ్చిన కుటుంబాలను నిత్యం పరిశీలించాలన్నారు. వారిని గుర్తించేందుకు సర్వే కొనసాగించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు స్వయంగా ఆరోగ్య వివరాలు చెప్పకపోతే... వారి కుటుంబసభ్యులకు చాలా నష్టమని సీఎం అభిప్రాయపడ్డారు. వసతిగృహాల్లో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే...క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించామని, నాణ్యమైన వైద్యం అందేలా చూసే బాధ్యత అధికారులదేనని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. అరటి, టమాటా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని... సూచించారు.
పట్టణాల్లోని రైతుబజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై జరిగిన చర్చలో నిత్యావసరాల డోర్ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి దుకాణం ముందు ధరల పట్టిక ఉంచాలన్న ఆదేశాలను రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. నిత్యావసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ఉదయం 6 నుంచి 11 వరకూ సమయం కేటాయించాలని, మిగతా చోట్ల ఉదయం 6 నుంచి ఒంటిగంటవరకూ సమయం పాటించాలని సీఎం అధికారులకు సూచించారు. మార్కెట్లలో జనం గుమిగూడకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చదవండి: 'వారంతా నేడు పదవీ విరమణ చేయాల్సిందే'