CM JAGAN DELHI TOUR: ముఖ్యమంత్రి వైఎస్ జగన్..నేడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం 11.50కి గన్నవరం విమానాశ్రయ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్లు గడిచినా ఇప్పటి వరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదని, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన పలు హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వాటిని సత్వరమే నెరవేర్చాలని ప్రధానిని సీఎం కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని ఇప్పటికే పలు సార్లు కోరిన సీఎం.. ఈ విషయమై మరో సారి విజ్ఞప్తి చేయనున్నారు.
పోలవరం బకాయిల కోసం.
జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జల వివాదాలపైనా ప్రధానితో సీఎం చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ బోర్డులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి సానుకూలత వ్యక్తం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను అప్పగిస్తే తామూ అప్పగిస్తామని స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించే విషయంపై పీటముడి నెలకొన్న పరిస్ధితుల్లో ఈ విషయంపైనా ప్రధానితో.. సీఎం చర్చించే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల అంశం సహా అమరావతి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల పైనా చర్చించే అవకాశాలున్నాయి.
హోం మంత్రి సహా పలువురు మంత్రులతో భేటీ?
విభజన నేపథ్యంలో ఇచ్చిన అన్ని హామీలను సత్వరమే నెరవేర్చాలని ప్రధానికి వినతి పత్రం ఇవ్వనున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు. 9, 10 షెడ్యూల్ లోని అంశాలు సహా ఇంకా పరిష్కారం కాని అంశాలను సత్వరమే పరిష్కరించాలని కోరనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశాలున్నాయి.
ఇటీవల తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిపిన సమావేశం లోనూ రాష్ట్ర విభజన హామీలను సత్వరమే అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తదనంతరం విభజన హామీల అమలుపై కేంద్ర హోం శాఖ మరింత దృష్టి పెట్టింది. ఈ నెల 12 న ఇరు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్రప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిస్ధితుల్లో సీఎం జగన్ దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది
ఇదీ చదవండి: 'రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే.. సైన్యంలోకి వెళ్లేవాడిని!'