రాష్ట్ర రహదారులు, జిల్లాల్లో ముఖ్య రహదారుల మరమ్మతు పనులకు అవసరమైన 2వేల 168 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. రహదారులపై రాకపోకలు సజావుగా సాగేలా, గుంతలు వెంటనే పూడ్చి, ప్యాచ్ వర్క్ చేపట్టాలని సూచించారు. దాదాపు 3 వేల కిలో మీటర్ల రహదారులపై ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉన్నందున... దీనికోసం అవసరమయ్యే 300 కోట్లు నిధులు కూడా మంజూరు చేసి, పనులు మొదలయ్యేలా చూడాలన్నారు.
రహదారులు – భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి మంత్రి ఎం.శంకరనారాయణ, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రహదారుల అభివృద్ధి మరమ్మతులపై అధికారులతో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. ఎన్‌డీబీ ఆర్థిక సహాయంతో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
రెండు నెలల్లో రీటెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలని సూచించారు. రహదారుల నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. వెంటనే అన్నిచోట్ల అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వాహనాల రద్దీని బట్టి ప్రాధాన్యత ఇస్తూ రహదారులు బాగు చేయాలని, వంతెనలు, అప్రోచ్ రహదారులు, ఆర్‌ఓబీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీల్లోనూ రహదారుల విస్తరణ చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: