రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి పూర్తి చేయాల్సిందేనని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూముల రీ సర్వేపై సీఎం బుధవారం సమీక్షించారు. పట్టణాల్లోనూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు. వివాదాలకు తావు లేకుండా సర్వే పూర్తయిన భూములకు ‘క్లియర్ టైటిల్స్’ ఇవ్వాలన్నారు. అటవీ, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అధికారులు రీ-సర్వేపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ, సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. కొవిడ్ కారణంగా రీసర్వే పనులు మందకొడిగా సాగుతున్నాయని, వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు అన్ని రకాల సేవలు, అన్ని ధ్రువపత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందాలని చెప్పారు. యూజర్ మాన్యువల్, తరచూ వచ్చే ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేసుకొనేలా వివరాలను డిజిటల్ ఫార్మాట్‌లో ఉంచాలని సూచించారు.
తొలిదశలో 4,800 గ్రామాల్లో సర్వే
‘పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాల్లో చేపట్టిన రీసర్వే పూర్తి కావచ్చింది. తొలిదశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడతాం. ఈ గ్రామాల్లో డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి చేసి, ముసాయిదాను ముద్రిస్తాం. భూముల రీ సర్వే కోసం ఇప్పటికే రాష్ట్రంలో 70 బేస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మరికొన్ని గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట్ల డ్రోన్లను ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తాం’ అని సర్వే అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
త్వరలో 41 పట్టణాలు/నగరాల్లో..
తొలిదశ సర్వేను 41 పట్టణాలు/ నగరాల్లో ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే జనవరికల్లా పూర్తి చేస్తామని పురపాలక అధికారులు చెప్పారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే ప్రారంభించామన్నారు. రెండో దశ కింద 42 పట్టణాలు/నగరాల్లో సర్వేను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించి అదే ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మూడో దశను 41 పట్టణాలు/నగరాల్లో 2022 నవంబరులో మొదలుపెట్టి ఏప్రిల్ 2023 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో భారీ వర్షాలు..పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం