ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులతో సమావేశమైన సీఎం... విద్యాకానుక, మనబడి నాడు నేడు, జగనన్న గోరుముద్ద పథకాలపై సమీక్షించారు. 3 జతల యూనిఫాంకు అవసరమయ్యే వస్త్రం, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్‌ల పంపిణీపై పలు సూచనలు చేశారు. కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లను సీఎం పరిశీలించారు. కాంపిటీటివ్ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. నాడు - నేడు పనుల్లో జాప్యం జరగకుండా చూడాలన్న సీఎం... పాఠశాల ప్రహరీ గోడ నుంచి భవనాల వరకు విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.
మెనూ వివరాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం మొబైల్ యాప్ సిద్ధం చేయాలని జగన్ సూచించారు. ఉపాధ్యాయుల శిక్షణ, కరిక్యులమ్, వర్క్‌బుక్, టెక్ట్స్‌బుక్‌ల విషయంలో అధికారుల పనితీరును సీఎం అభినందించారు. విద్యార్థులకు నైతిక విలువలపైనా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. మానసిక వికలాంగుల కోసం పులివెందుల విజేత స్కూల్ తరహాలో నియోజకవర్గానికి ఒక పాఠశాల ఉండాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి అంతర్జాలంపై అవగాహన పెంచాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఆ దిశలో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నాడు - నేడులో భాగంగా 100 కంపెనీలతో మార్చి మూడో వారంలో సీఎస్ఆర్ కాంక్లేవ్ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి: '2021 జూన్ నాటికి పోలవరం పూర్తి కావాల్సిందే..!'