రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆయా చోట్ల 30 నుంచి 50 ఎకరాల భూసేకరణ చేసి వాటిలో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే ఉచితంగా 5 ఎకరాలు ఇవ్వాలని ఆదేశించారు. మూడేళ్లలో కనీసం 100 కోట్లు పెట్టుబడి పెట్టి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నారు. డిమాండ్ ఉండే చోట్ల అవసరం మేరకు అదనంగా భూ సేకరణ చేయాలని సీఎం సూచించారు. హెల్త్ హబ్‌ల ఏర్పాటు కోసం నెల రోజుల్లో పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాక్సిన్లు తయారవ్వాలన్న సీఎం.. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రాలు సహా 3 నగర పాలికలు..
అన్ని జిల్లా కేంద్రాలు, మూడు కార్పొరేషన్లలో హెల్త్ హబ్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరాలను భాగం చేస్తూ మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఉండాలన్నారు. ఫలితంగా 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు రాష్ట్రానికి వస్తాయన్నారు. వీటితో పాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్ కాలేజీలు రానున్నట్లు సీఎం వివరించారు. హెల్త్ హబ్‌ల ఏర్పాటుతో ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు.
నెల రోజుల్లో పాలసీ తీసుకురావాలి..
ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం వల్ల ప్రైవేట్ రంగంలోనూ మంచి ఆస్పత్రులు వస్తాయన్నారు. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రంతో పాటు, కార్పొరేషన్లలోనూ మల్టీ స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటు అవుతాయన్నారు. దీని వల్ల టెరిటోరి మెడికల్ కేర్ విస్త్రృతంగా మెరుగు పడుతుందని, వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు కూడా ఉన్నత ప్రమాణాలతో వైద్యం అందుతుందని సీఎం పేర్కొన్నారు. హెల్త్ హబ్‌లపై ఒక నెల రోజుల్లో పాలసీని తీసుకురావాలని ఆదేశించారు.
టీకాలు సైతం సర్కార్ ఆధ్వర్యంలో..
వాక్సిన్ తయారీ సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై ఓ విధానాన్ని తీసుకురావాలన్నారు.
కరోనా కట్టడిపై సీఎం సమీక్ష..
రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, నివారణ, వాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆయుష్ కమిషనర్ వి.రాములుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మౌలిక అంశాల కల్పనపై కీలక నిర్ణయాలు..
రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే అంశంపై చర్చించిన సీఎం.. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం - హైలీ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్ కోసం బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వైద్యానికి వెళ్తుండటంపై సీఎం స్పందించారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తగ్గుతున్న పాజిటివిటీ రేటు..
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిని అధికారులు వివరించారు. మే 17న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా.. మే 27 నాటికి 19.20 శాతంగా ఉందని, 10 నుంచి 12 రోజలుగా పాజిటివిటీ రేటు తగ్గుకుంటూ వస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోందన్నారు. మే 18 న 2 లక్షల 11వేలకు పైగా కేసులు ఉండగా.. మే 26 నాటికి లక్షా 86 వేలకు తగ్గాయని నివేదించారు.
మెరుగ్గా రికవరీ రేటు..
రికవరీ రేటు సైతం మెరుగుపడుతోందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మే 7న రికవరీ రేటు 84.3 శాతం ఉండగా.. మే 27న 87.99 శాతం ఉందన్నారు. గడచిన ఏడు వారాల గణాంకాలను పరిశీలిస్తే జిల్లాల వారీగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు.
3 గంటల్లోగా పరిష్కారం..
రాష్ట్ర వ్యాప్తంగా 597 కొవిడ్ కేర్ ఆస్పత్రులు ఉండగా వాటిలో మొత్తం 46,596 బెడ్లు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో మొత్తం 32 వేల 567 బెడ్లు నిండిపోగా.. వాటిలో 24 వేల 985 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని తెలిపారు. 116 కొవిడ్ కేర్ సెంటర్లలో 52,941 పడకలు ఉండగా, 16,689 పడకలు నిండాయన్నారు. హోం ఐసొలేషన్‌లో 1,37,436 మంది ఉన్నారని అధికారులు వివరించారు. 104 కాల్ సెంటర్ పని తీరుపైనా సీఎం సమీక్షించారు. ఫోన్ చేసిన వారికి 3 గంటల్లోగా పరిష్కారం చూపుతున్నామని అధికారులు బదులు ఇచ్చారు.
తీవ్రత తగ్గింది..
బ్లాక్ ఫంగస్ కేసుల గురించి వచ్చిన కాల్స్‌ను నోటిఫైడ్ ఆస్పత్రులకు పంపిస్తున్నామన్నారు. 104కు వచ్చే కాల్స్ కూడా బాగా తగ్గాయని, కేసుల తీవ్రత తగ్గిందనడానికి ఇది సంకేతమన్నారు. మే 4న 19 వేల 175 కాల్స్ రాగా, మే 27న 5 వేల 421 కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 808 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించినట్లు అధికారుల వెల్లడించగా.. కొత్తగా 3,445 ఇంజక్షన్లు వచ్చాయని, వాటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 5,200 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరాల్లో కనీసం 10 శాతం ఇంజక్షన్లు కూడా లేవని సీఎంకు చెప్పారు.
దాదాపు 40 వేల ఇంజక్షన్లు అవసరం..
కేసుల సంఖ్యను పరిశీలిస్తే వచ్చే వారం రోజుల్లో కనీసంగా 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయన్న సీఎం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు సరిపోవన్నారు. ఇంజక్షన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉందన్న సీఎం.. అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య పరంగా ఉన్న ప్రత్యామ్నాయాలపై వైద్యులు, అధికారులను సీఎం అడిగగా బ్లాక్ ఫంగస్ కేసు తీవ్రతను బట్టి కొందరికి ఇంజక్షన్లు, మరికొందరికి ఇంజక్షన్లతో పాటు టాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బ్లాక్ ఫంగస్‌కు మందులు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. కంపెనీలతో సమన్వయం చేసుకుని వాటిని తెప్పించుకోవాలన్నారు.
అడ్మిషన్లు తగ్గినా ఆక్సిజన్ నిల్వలు పెంచాలి..
అనంతరం ఆక్సిజన్ సరఫరా, అందుబాటుపై సీఎం సమీక్షించారు. తుపానును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకున్నామని, ఫలితంగా మే 26న 812.78 టన్నుల ఆక్సిజన్ సేకరించుకోగలిగామని అధికారులు తెలిపారు. గడచిన ఐదు రోజుల్లో సగటున 670 టన్నులు అందుబాటులోకి తీసుకురాగలిగామన్నారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు తగ్గినా సరే.. ఆక్సిజన్ పైపులైన్లు, ఆక్సిజన్ నిల్వ తదితర పనులను నిలిపేయవద్దని, వాటిని పూర్తిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా..
నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకూ 66 ఫిర్యాదులు వచ్చాయని, 43 ఆస్పత్రులపై రూ.2.4 కోట్లు జరిమానా విధించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 78 మంది అనాథ పిల్లలను గుర్తించామన్నారు. వారిలో ఇప్పటికే 10 మందికి 10 లక్షలు చొప్పున డిపాజిట్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సరైన స్కీంలో డిపాజిట్ అయ్యేలా చూడాలన్న సీఎం.. వివిధ సంస్థల పాలసీలను పరిశీలించి అందులో ఆ డబ్బును డిపాజిట్ చేయాలని నిర్దేశించారు.
ఔషధంపై నివేదిక తర్వాతే నిర్ణయం..
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుకు సంబంధించి సీసీఆర్‌ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత అన్ని అంశాలు పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి :