పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల గొంతు తడిపేందుకే.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. కేవలం పది రోజులకు మించి.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకెళ్లే పరిస్థితి ఉండదని.. ఈ విషయంలో తెలంగాణ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే.. వాడుకుంటామన్నారు.
- మనం కట్టుకుంటున్న ప్రాజెక్టు ఇది
మనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి ఒక సదుపాయం మాత్రమే ఇది అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసం అని తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. కృష్ణా వాటర్‌బోర్డు డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) ప్రకారమే ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయమని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందన్నారు. ఎవరైనా మానవత్వంతో ఆలోచన చేయాలన్నారు. వైఎస్ మానవత్వంతో ఆలోచించడం వల్లే నీళ్లు తెచ్చుకోగలుగుతున్నారన్న జగన్.. ఎవరైనా కృష్ణా బోర్డు నిర్దేశాల ప్రకారమే నీటిని తీసుకోవాలన్నారు. మన భూభాగంలో మనం కట్టుకుంటున్న ప్రాజెక్టు అని.. సీఎం వ్యాఖ్యానించారు.
- తప్పు ఎలా అవుతుంది?
శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహాకష్టం. ఆ పది రోజుల్లోనే రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలంలో 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీరు వెయ్యి క్యూసెక్కులు మాత్రమే. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్ నుంచి వెళ్లేది గరిష్టంగా 9 వేల క్యూసెక్కులే. శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి. మన కేటాయింపుల ప్రకారం మనం నీటిని తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది. -సీఎం జగన్
- ఇంకా సీఎం ఏమన్నారంటే..
- తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే పరిస్థితి మరోలా ఉంటుంది.
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించవచ్చు.
- శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో కూడా నీటిని తరలించవచ్చు.
- రోజుకు 2 టీఎంసీల మేర 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
- కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
- శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిని రోజుకు 0.3 టీఎంసీలు తీసుకెళ్లగలరు.
- ఇదే 800 అడుగుల స్థాయిలో డిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలు తీసుకెళ్లగలరు.
- డిండి నుంచి 30 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
- ఎస్‌ఎల్‌బీసీ ద్వారా శ్రీశైలంలో 824 అడుగులు ఉన్నప్పుడు కూడా తరలించగలదు.
- ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
- రోజుకు సుమారు 0.51 టీఎంసీ నీటిని తెలంగాణ రాష్ట్రం తరలించగలదు.
- వీటన్నింటి ద్వారా శ్రీశైలం నుంచి 200 టీఎంసీలు తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది.
- జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయల్‌సాగర్ నుంచి తెలంగాణ నీళ్లు తీసుకోగలుగుతుంది.
- ఇన్ని ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ నీరు తీసుకెళ్తోంది.
- 800 అడుగుల నుంచి తెలంగాణ నీటిని తీసుకుంటోంది.
ఇదీ చదవండి: ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు