ఏపీకి నీటి కేటాయింపులపై స్పష్టమైన ఆదేశాలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేటాయింపులపై అపెక్స్ కౌన్సిల్‌లో స్పష్టమైన ఆదేశాలు రాబట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గోదావరి - కృష్ణా బేసిన్‌లోని నీటి వాటాలో రాజీ ఉండకూడదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి జగన్ సూచనలు ఇచ్చారు. కేఆర్ఎంబీ వ్యవహారం, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై స్పందన లేదంటూ ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్రం రాసిన లేఖపైనా ప్రభుత్వం ఇటీవల ఘాటుగానే స్పందించింది.
కృష్ణా జలాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. కేఆర్‌ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. కేఆర్‌ఎంబీ ఉదాసీనంగా ఉందంటూ కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ రాశారు. విద్యుదుత్పత్తికి తెలంగాణకు నీటి విడుదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేయలేమన్నా.. పట్టించుకోలేదని లేఖలో ప్రస్తావించారు. పోతిరెడ్డిపాడు ద్వారా 0.5 టీఎంసీలను అదనంగా వాడితే తప్పుపట్టడం న్యాయం కాదని పేర్కొన్నారు. శ్రీశైలంలో వరద ప్రవాహం పెరిగినందున పోతిరెడ్డిపాడు నుంచి 66 టీఎంసీలు కేటాయించాలని లేఖ రాశారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలపై గట్టిగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమకు 144 టీఎంసీల కేటాయింపుపై తెలంగాణ అంగీకారం తెలిపిందని జలవనరుల శాఖ వివరించింది. 2015 నాటి కేఆర్‌ఎంబీ సమావేశంలోనే తెలంగాణ అంగీకారం తెలిపిందని జలవనరుల శాఖ గుర్తుచేసింది. మొదటి అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని అధికారులు చెబుతున్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంతోపాటు కోర్టులకు ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: