Karate Kalyani: దత్తత తీసుకోవాలంటే న్యాయబద్ధంగానే తీసుకుంటానని... పాపను దత్తత తీసుకోలేదని ఆ పాప తల్లిదండ్రులే తమతో పాటు ఉంటున్నారని సినీ నటి కరాటే కల్యాణి స్పష్టం చేశారు. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం కల్యాణి వద్ద ఉన్న పాపను సీడబ్ల్యూసీ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో కేసును రంగారెడ్డి జిల్లా అధికారులకు బదలాయించారు. దత్తత తీసుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కల్యాణిని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు.
రెండు రోజుల నుంచి తనపై అనేక ఆరోపణలు వచ్చాయని కరాటే కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు కలత చెంది.. తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారని.. తాను వారికి ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. తాను బీసీ వర్గానికి చెందిన బిడ్డను కాబట్టే రాజకీయంగా ఎదుర్కోలేక.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయనాయకులు, అధికారులు ఉన్నారని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన వారిని చట్టబద్ధంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కాగా చిన్నారి దత్తత వ్యవహారంలో కరాటే కల్యాణి కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..
ఇవీ చదవండి: Karate Kalyani: 'పాత కక్షలతో కేసులు పెట్టి నన్ను వేధిస్తున్నారు'