గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే మధ్య నాలుగు విడతల్లో ఏపీ పోలీసుశాఖ నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా సంరక్షించిన 34,037 మంది బాలల వివరాల్ని విశ్లేషిస్తే.. వారిలో 51.54 శాతం మంది కూలీలుగా మగ్గిపోతున్నట్లు, 1.95 శాతం మంది యాచనతో నెట్టుకొస్తున్నట్లు, 12.19 శాతం మంది నిరాశ్రయులై వీధి బాలలుగా గడుపుతున్నట్లు వెల్లడైంది. 68.16 శాతం మంది బాలలు పేదరికం వల్లే ఇలాంటి జీవనం సాగిస్తున్నట్లు తేలింది...
ఎన్ని విడతల్లో ఎందరు?...
- గతేడాది నుంచి ఇప్పటివరకూ నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్’: 4 విడతలు
- సంరక్షించిన వారి సంఖ్య: 34,037 మంది
- వారిలో బాలురు: 28,386 మంది (83.39 శాతం)
- బాలికలు: 5,651 మంది (16.61 శాతం) అత్యధికులు కార్మికులే
- ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన వారిలో అత్యధిక శాతం మంది బాల కార్మికులే. మిరప తోటలు, టీ దుకాణాలు, మోటార్ మెకానిక్ షెడ్లు, దాబాలు తదితర చోట్ల పలు రకాల పనులు చేస్తున్నారు.
- ఇంటి నుంచి పారిపోయి వచ్చిన, తప్పిపోయిన వారిలో కొందరు, కుటుంబ ఆనవాయితీని కొనసాగించే మరికొందరు బాలలు యాచిస్తూ గడుపుతున్నారు. వీరిని నడిపించే కొన్ని ముఠాలూ ఉన్నాయి.
- చాలామంది బాలలు తల్లిదండ్రులను కోల్పోయి, ఆదరించేవారు లేక రోడ్డున పడుతున్నారు. వీరు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల సమీపంలో వీధి బాలలుగా జీవితం గడుపుతున్నారు.
పేదరికమే శాపం అవుతోంది
బాలల జీవితం చిన్నాభిన్నమైపోవటానికి ప్రధాన కారణం పేదరికమే. మూడు పూటలా తినేందుకు తగినంత ఆదాయం లేక, ఉపాధి కొరవడి చాలామంది వారి పిల్లల్ని ఏవో ఒక పనుల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోవటమో, మరణించటమో లేదా దురలవాట్ల బారిన పడి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవటమో, కుటుంబంలో గొడవలతో చిన్నారుల్ని గాలికొదిలేయటం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది వీధి బాలలుగా మారుతున్నారు. కొన్ని రకాల వర్గాలు యాచన, చెత్త ఏరుకోవటం వంటి వాటిని కుటుంబ ఆనవాయితీగా కొనసాగిస్తున్నాయి. అలాంటి వారు పిల్లల్ని బలవంతంగా ఈ ఊబిలోకి నెడుతున్నారు.
ముక్కుపచ్చలారని వయసులోనూ..
ముక్కుపచ్చలారని వయసులోనూ అనేక మంది చిన్నారులు.. వీధి బాలలుగా మారిపోతున్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన వారిలో 772 మంది 0-5లోపు వయసు కలిగినవారే. అసలు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని ప్రాయం వీరిది. ఎవరో చేసిన తప్పునకు వీరి జీవితం బలైపోతోంది.
ముఖ్యమైన కారణాలివే..
- పేదరికం 23,185 (68.11 శాతం)
- తల్లిదండ్రుల సంరక్షణ కొరవడటం 3,072 (9.03%)
- సామాజిక వెనుకబాటుతనం, కుటుంబ ఆనవాయితీ, చెడు వ్యసనాలకు బానిసవటం తదితరాలు 7,740 (22.74%)
- పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవటం 40 (0.12%)
నిరక్షరాస్యులు 12% మంది..
సంరక్షించిన బాలల్లో 12 శాతం మంది నిరక్షరాస్యులే. 26 శాతం మంది అయిదో తరగతి చదువుతోనే ఆపేయాల్సిన పరిస్థితి. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
- నిరక్షరాస్యులు: 4,196 (12.32%)
- 1-5 తరగతి: 8,903 (26.16%)
- 6-10 తరగతి: 20,938 (61.52%)
ఇదీ చదవండి: