ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. సీఎమ్‌వో అధికారులు పర్యవేక్షించే శాఖలను పునర్విభజించారు. మొత్తం బాధ్యతలను ముగ్గురు అధికారులకు కేటాయించారు. సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు అగ్రాసనం వేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాల పర్యవేక్షణ సహా చాలా ప్రధాన శాఖలను ఆయనకే కేటాయించారు. మిగతా వాటిని సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డిలకు అప్పగించారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల కేటాయింపునకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నీ రద్దవుతాయని తెలిపారు. ఇంతవరకూ ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు సహా ప్రధాన శాఖలు పర్యవేక్షిస్తున్న అజేయ కల్లం, అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, అదనపు కార్యదర్శి మురళిలకు ఎలాంటి శాఖలనూ కేటాయించలేదు. వారు ముగ్గురూ విశ్రాంత ఐఏఎస్ అధికారులే. వారితో పాటు ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆర్థిక, ఇంధనశాఖల వ్యవహారాలు చూస్తున్న దువ్వూరి శ్రీకృష్ణ, ఆరోగ్యశ్రీ, సీఎమ్ఆర్ఎఫ్, జనరల్ గ్రీవెన్సెస్‌ను చూస్తున్న ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి హరికృష్ణల పేర్లు తాజా ఉత్తర్లుల్లో లేవు.
వారికి వేరే బాధ్యతలు
అజేయకల్లం, పీవీ రమేశ్, మురళిలకు ఎలాంటి శాఖలూ కేటాయించపోవడంతో వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కార్యకలాపాలన్నీ అజేయకల్లం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. సీఎంవో అధికారుల్లో ఎవరికి ఏ బాధ్యతలు కేటాయించాలన్నది ఆయనే నిర్ణయించేవారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే కాకుండా దాదాపు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఆయన పర్యవేక్షణలోనే పనిచేసేవారు. హోం, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, న్యాయ, శాసనసభ వ్యవహారాలు, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను ఆయన చూసేవారు. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌కు ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన పదవీవిరమణ చేసినా అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమంతో పాటు మొత్తం విద్యాశాఖల్ని ఆయన చూసేవారు. జె.మురళి సైతం సర్వీసులో ఉండగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. ఐఏఎస్ అధికారిగా పదవి విరమణ చేశాక కూడా అదనపు కార్యదర్శి హోదాలో కొనసాగారు. ఆయన పశుసంవర్ధక, మత్స్యశాఖలు,సహకారం, మార్కెటింగ్, సాంస్కృతిక, ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రీవెన్సులు, ప్రత్యేక అభివృద్ధి నిధి వ్యవహారాలను చూసేవారు.
అజేయ కల్లం పర్యవేక్షణలో ఉన్నశాఖల్లో... మౌలిక వసతులు, పెట్టుబడులను ఆరోఖ్యరాజ్‌కు, మిగిలిన శాఖలన్నీ ప్రవీణ్ ప్రకాశ్‌కు అప్పగించారు. పీవీ రమేశ్ చూసే వైద్యారోగ్య శాఖను ధనుంజయ్‌రెడ్డికి, విద్యాశాఖను ఆరోఖ్యరాజ్‌కు కేటాయించారు. మురళి చూస్తున్న శాఖలను ధనుంజయ్‌రెడ్డికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల్లో అజేయకల్లం, పీవీ రమేశ్, జె. మురళిలకు ఎలాంటి శాఖలూ కేటాయించపోవడంతో వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది.
ఇదీ చదవండి : ఆర్టీసీలో ఉద్యోగాల పేరిటి...రూ.57 లక్షలు స్వాహా