రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చాలని.. ఎస్ఈసీ ఆదేశించింది. వాహనాలపై వైకాపా రంగులు ఉన్నాయని అభిప్రాయపడిన ఎస్‌ఈసీ... పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి తేవాలని అధికారులకు సూచించింది. గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. రంగులు మార్చాకే వాహనాల ద్వారా పంపిణీకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. రెండ్రోజుల క్రితం వాహనాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పరిశీలించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ పంపిణీ వాహనాలు పరిశీలించిన ఎస్‌ఈసీ... పంపిణీ వాహనాలు, పథకం అమలు పరిశీలన అనంతరం ఆదేశాలు ఇచ్చారు.
ప్రముఖంగా కన్పించేది వైకాపాను పోలిన రంగులే
‘మొబైల్ వాహనంపై ఇతర రంగులూ ఉన్నా.. ప్రముఖంగా వైకాపా రంగులను పోలినవే కన్పిస్తున్నాయి. వాహనంపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి బొమ్మలను ప్రదర్శిస్తున్నారు. ఇలా చిత్రాలను ఉపయోగించడం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకం. వాహనంపై ప్రదర్శించే ‘నవరత్నాలు’ లోగో అధికార పార్టీ ఎన్నికల ప్రణాళికగా పరిగణిస్తారు. ఎన్నికల కోడ్‌కు ముందే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినందున కొత్త పథకం కిందికి రాదని చెప్పడానికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ ప్రయత్నించారు. ఈ తర్కాన్ని ఎస్‌ఈసీ అంగీకరించడం లేదు. పైలట్ ప్రాజెక్టు, పూర్తి స్థాయి పథకం మధ్య వ్యత్యాసాలుంటాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పథకాన్ని ప్రారంభించడం ద్వారా న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించింది’ అని ఎస్‌ఈసీ తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొచ్చినా..
‘పంచాయతీ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచి ఈ ఏడాది జనవరి 21న తీర్పునిచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రసార మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. తీర్పు అనంతరమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. ఈ అంశాన్ని పట్టించుకోకుండా అదే రోజున ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించారు’ అని వివరించారు.
ఇదీ చదవండీ... 'తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించవద్దు'