కృష్ణా నది వరద పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు..గుంటూరు రాష్ట్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి 19 గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించానని స్పష్టం చేశారు. లంక గ్రామాలలో హృదయ విదారకమైన సంఘటనలు చూశామని పేర్కొన్నారు. 20 రోజులు వరద నీరు ప్రవహిస్తుంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
వరదలపై
మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసేవరకు వరద నీరు 1400కి.మీ. ప్రయాణిస్తుందని చంద్రబాబు అన్నారు. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4 టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందన్న చంద్రబాబు... సీడబ్ల్యూసీ లెక్కల వివరాలను తెలిపారు. ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీరు రావాలంటే 12 గంటలు పడుతుందని స్పష్టం చేశారు. నీటి ప్రవాహం వివరాలన్నీ ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్నా వారు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా నీళ్లు వదిలారని చంద్రబాబు విమర్శించారు. శ్రీశైలంలో నుంచి ఒక్కసారిగా నీరు వదిలి కృష్ణ పరివాహక ప్రాంతాలను ముంపునకు గురిచేశారు. తన ఇంటిని ముంచాలనే దురుద్దేశ్యంతోనే కృత్రిమ వరదలను సృష్టించారు.
సీఎం ఒక్క సమీక్షా చేయలేదు
వరదను నియంత్రించడానికి అవకాశం ఉన్నా సరైన పద్ధతిలో నీళ్లు వదలలేదని చంద్రబాబు విమర్శించారు. వరదలపై ఏనాడు ముఖ్యమంత్రి జగన్ ఒక్క సమీక్ష చేయలేదని ఆరోపించారు. తన ఇళ్లు ముంచాలని కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ ముంచారని చంద్రబాబు విమర్శించారు. వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైపరీత్యం తెదేపా అధినేత పేర్కొన్నారు.
పరిహారం చెల్లించండి
53వేల ఎకరాల భూమి వరద ముంపునకు గురయ్యాయని చంద్రబాబు తెలిపారు. రూ.3 నుంచి 4 వేల కోట్లు రైతులకు నష్టం కలిగిందని చంద్రబాబు అన్నారు. ఐఎండీ, ఇస్రో హెచ్చరికలు ఉంటే ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. రైతులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు...నెలకు సరిపడా రేషన్ సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని కోరారు. పొలాల్లో, ఇళ్లలో బురద తొలగించుకునేందుకు ఆర్థికసాయం చేయాలన్నారు.
రాజధాని మారుస్తారా..!
పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, హంద్రీనీవా ఎందుకు నీరు వదల్లేదని ప్రశ్నించారు. ఒకస్థాయి నీరొస్తేనే పోతిరెడ్డిపాడు వినియోగించుకోవచ్చు.. అలా చేయకుండా రాజధాని ముంచేందుకు ప్రయత్నించారని తెదేపా అధినేత ఆరోపించారు. ముంబై, చెన్నై, బెంగళూరుకు వరదలు వస్తాయన్న చంద్రబాబు...రాజధానిని మారుస్తారా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమకు చుక్కనీరు ఇవ్వకుండా కావాలనే ప్రకాశం బ్యారేజ్ విడుదల చేశారని చంద్రబాబు తెలిపారు. ఇతర ప్రాజెక్టులను నింపే అవకాశం ఉన్నా...నీటిని అటువైపు తరలించకుండా కేవలం ప్రతిపక్షనేత ఇల్లు ముంచాలనే ప్రభుత్వం పనిచేసిందని ఆరోపించారు.
తన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతలందరూ తన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశారని విమర్శించారు. డ్రోన్ పేరిట తన ఇంటిపై నిఘా పెట్టారన్న చంద్రబాబు...ప్రభుత్వం తరఫు వ్యక్తులే ఈ చర్యలు పాల్పడ్డారని చంద్రబాబు తెలిపారు.
తెలంగాణపై
తెలంగాణతో సంబంధాలు బాగున్నాయని చెబుతున్న వైకాపా.. సముద్రంలోకి పోయే నీటిని పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తే తెలంగాణ ఎందుకు ఫిర్యాదు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడుపై కృష్ణా వాటర్ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణ ఎందుకు ఫిర్యాదు చేసిందో వివరణ ఇవ్వాలన్నారు.
కోడెల వ్యవహారంపై
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే తామేమి అడ్డుచెప్పమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. అసెంబ్లీ వస్తువుల చోరీవ్యవహారంపై కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు. కక్ష సాధింపు సరికాదన్న ఆయన..వైకాపా కావాలనే కంప్యూటర్ల చోరీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి :