ముఖ్యమంత్రి సొంత కంపెనీకి ఆయనే మైనింగ్ లీజు పొడిగించుకోవడం, నీళ్లు కేటాయించుకోవడం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘గుంటూరు జిల్లా దాచేపల్లిలో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు 50 ఏళ్లు పొడిగించడం ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. మొదట 0.7 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించుకున్నారు. ఇప్పుడు ఏకంగా మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగించుకున్నారు. అడిగేవాళ్లు లేరని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. జగన్ సొంత వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకోవడానికేనా ఒక్కఛాన్స్ అని అడిగింది’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
తెదేపా ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆయన మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీకి ద్రోహం చేసినవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ద్రోహులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు. ‘‘వైకాపా ఏడాది పాలనలో అన్నీ రద్దులే. స్కీంల పేరుతో స్కాంలకు పాల్పడ్డారు. చివరకు కరోనా కిట్లలోను, బ్లీచింగ్‌లోను కుంభకోణాలకు పాల్పడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటిపై చర్చించాలి. రాజీలేని పోరాటం చేయాలి’’ అని తెలిపారు.
ఈ భేటీలో చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు..!
* వైకాపా విధ్వంస పాలనపై తెదేపా రూపొందించిన ఛార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
* ఇళ్ల స్థలాల కుంభకోణం, బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయినవారిలో 90 శాతం దళితులు, బలహీనవర్గాలవారేనని తెదేపా నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనలో తేలింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 12,300 మంది నుంచి 3,190 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు. పేదలకు తెదేపా ప్రభుత్వం ఇచ్చిన 5,721 ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. భూసేకరణ పేరుతో వైకాపా నాయకులు రూ.1,600 కోట్లు స్వాహా చేశారు.
* రాష్ట్రంలో గనులన్నీ వైకాపా నాయకులే కబ్జా చేశారు. విశాఖ ఏజెన్సీలో లేటరైట్ గనులపై తాజాగా కన్నేశారు. తెదేపా సానుభూతి పరుల ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి సహా ఇతర వైకాపా నాయకుల మైనింగ్ సంస్థలపై వేసిన జరిమానాలను రద్దు చేశారు. తెదేపా సానుభూతిపరులనే సాకుతో వైద్య కళాశాలల యాజమాన్యాలను వేధిస్తున్నారు.
* మద్యం, భూమి, ఇసుక, గృహనిర్మాణం, మైనింగ్‌లలో వైకాపా నాయకులు చేయని అరాచకం లేదు. ముడుపుల కోసమే సిమెంట్ ధరలు పెంచేశారు.
* విద్యుత్ బిల్లులు పెంచేసి పేదల జీవితాలను దుర్భరం చేశారు. నెలకు రూ.200 వచ్చే బిల్లు, ఇప్పుడు రూ.2 వేలు రావడం చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి రూ.2 వేల కోట్ల భారం మోపారు.
* ఏడాదిలో 600మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలోనే లాక్‌డౌన్ సమయంలో 14 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
రూ.10 వేలు ఇవ్వాలి: లోకేశ్
ముఖ్యమంత్రి జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఏడాదిగా భవన నిర్మాణ రంగం కుదేలైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నాయకులతో మంగళవారం ఆయన టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు.కార్మికులకు తక్షణం రూ.పది వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: సాగునీటి రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారు: దేవినేని