వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఇప్పటివరకు 24 బిల్లులు తీసుకొచ్చారని..వాటిల్లో కొన్నింటిపై కనీస చర్చ జరగలేదన్నారు. రాష్ట్రంలో ఇష్టానుసారంగా పన్నులు పెంచుకుంటూపోవడం దారుణమన్నారు. ఇళ్ల నుంచి వచ్చిన చెత్తపైనా కూడా పన్ను వేస్తారా..? అని ప్రశ్నించారు. రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడం అన్యాయమన్నారు. కేంద్రం ఇచ్చే మొత్తాన్ని ఖాతాలో వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్పొరేషన్ల నుంచి అప్పులు తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులు పనిలేక బాధలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక కనీసం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదన్నారు.
'విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇష్టానుసారంగా పన్నులు పెంచటం ఆశ్చర్యకరంగా ఉంది. పింఛన్ల సంఖ్యపై ముఖ్యమంత్రి జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వాల లెక్కలు ఎప్పుడూ మారవని గుర్తుంచుకోవాలి. పింఛన్లపై జగన్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఉండే అర్హత సీఎంకు లేదు. ప్రతిపక్షంలో ఉండి మేం వాస్తవాలు చెబుతుంటే... అధికార పక్షం అవాస్తవాలు చెబుతోంది. తప్పుడు లెక్కలపై ఎవరైనా ప్రశ్నిస్తే మాటల దాడి చేస్తారా...?- చంద్రబాబు, తెదేపా అధినేత
అదాయం కంటే అప్పులే ఎక్కువ....
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. వీటికి రెవెన్యూ లోటు తోడైందని తెలిపారు. పంటల బీమాలో రైతుల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 26లక్షల మందికే కట్టి 50లక్షల మందికి కట్టినట్లు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు వేలం వేయటానికి అవేమీ జగన్ అబ్బ సొత్తు కాదని ధ్వజమెత్తారు.
ఆ హామీని మరిచిపోయారు...
రైతుల జీవితాలతో ఆడుకోవటం తగదని హితవు పలికారు. వారం రోజుల్లో సీపీఎస్ సమస్యను తీర్చుతామని జగన్ హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా అటువైపు చూడలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.
అమూల్ తీసుకురావడమేంటి...?
స్థానిక డెయిరీలను కాదని గుజరాత్ నుంచి అమూల్ తీసుకురావడం ఏమిటని చంద్రబాబు ధ్వజమెత్తారు. అధిక ధరకు అమూల్ ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. హెరిటేజ్ ని దెబ్బతీయాలని వ్యవస్థనే నాశనం చేస్తారా అని మండిపడ్డారు. హెరిటేజ్ ని దెబ్బ తీయటం జగన్ వల్ల కాదని స్పష్టం చేశారు. తితిదే పాలక మండలి లో సొంత సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.
సత్తా లేకే సస్పెండ్ నిర్ణయం..
చేసింది చెప్పుకునే సత్తా లేకే ప్రభుత్వం అసెంబ్లీలో 5 రోజులుగా తమను సస్పెండ్ చేస్తూ వచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని బెదిరించటం, వారి తరపున మాట్లాడే వారిపై దాడులు చేయటం నీచమైన చర్యని మండిపడ్డారు. రైతు సమస్యల పరిష్కారం ఆలోచనే లేదని దుయ్యబట్టారు. దశ దిశ లేని దిశ చట్టాన్ని ఆటకెక్కించారని ఆరోపించారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు...
పోలీసులు ఇస్ఠానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనేకమార్లు కోర్టుకు వెళ్లి సంజాయిషీ ఇచ్చుకున్న డీజీపీ అన్ని వదిలేసినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం ఉన్మాద చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల పంచాయతీలు రాష్ట్రమంతా చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి