తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన నాణ్యమైన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం సాకులు చెబుతోందని చంద్రబాబు మండిపడ్డారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయలతో 25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. గ్రామాల్లో దాదాపు 10 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు. సర్వాంగ సుందరంగా నిర్మించి పంపిణీకి సిద్ధం చేసిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా.. ఇప్పుడు కరోనా క్వారంటైన్ కేంద్రాలకు కేటాయించారన్నారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వర్చువల్ ఆందోళనలు చేపట్టింది. 13 జిల్లాల్లో 102 చోట్ల నిరసనలు కొనసాగాయి. తెలుగుదేశం నిర్వహించిన ఆందోళనలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.
లక్షాలాది ఇళ్లు నిర్మించి సామూహిక గృహప్రవేశాల ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామని చంద్రబాబు తెలిపారు. పూర్తైన ఇళ్లను పేదలకు వెంటనే అందజేసి గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని మేనిఫెస్టోలో పెట్టిన వైకాపా.. తొలిఏడాదిలో నిర్మించాల్సి ఉన్న 5 లక్షల ఇళ్లల్లో పదోవంతు కూడా మొదలు పెట్టలేదని చంద్రబాబు విమర్శించారు. కట్టించి సిద్ధంగా ఉన్న ఇళ్లు పంచకుండా.. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట వందల కోట్ల భూ కుంభకోణాలకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. ఎకరం 5 లక్షల విలువ చేసే భూమిని 50 లక్షలకు కొని.. వైకాపా నేతల జేబులు నింపారని మండిపడ్డారు. స్థానికంగానూ ఇంటి పట్టాకు 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు పేదల నుంచి ఆ పార్టీ నేతలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అమరావతి పోరుకు మద్దతుగా.. అమెరికాలో ప్రవాసాంధ్రుల నిరసన