నిర్భయ దోషులకు ఉరి అమలు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'దేశం మొత్తం కోరుకున్నట్టుగానే నిర్భయకు న్యాయం జరిగింది. తన బిడ్డకు న్యాయం జరిగేవరకు నిర్భయ తల్లి చేసిన న్యాయ పోరాటం అభినందనీయం. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
2012 డిసెంబర్ 16న దక్షిణ దిల్లీలో కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, మరో ఇద్దరు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్భయ స్నేహితుడిని తీవ్రంగా కొట్టి నడిరోడ్డుపై వారిని తోసేసి పరారయ్యారు. 15 రోజులు మృత్యువుతో పోరాడిన నిర్భయ డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. బాల నేరస్థుడనే కారణంగా మూడేళ్ల అనంతరం వీరిలో ఒకరిని విడుదల చేశారు. మరో నిందితుడు తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురిని ఇవాళ తెల్లవారుజామున తీహార్ జైలులో ఉరి తీశారు.
ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!