కరోనా కారణంగా.. ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వారం వ్యవధిలో నలుగురు ఉద్యోగులు కరోనాతో మృతిచెందారని.. మృతుల కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపమే ఉద్యోగుల మృతికి కారణమని చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల రక్షణపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదు.. ఉద్యోగులు మాత్రం విధులకు హాజరవ్వాల్సిందేనని చెప్పడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు.
'ప్రభుత్వ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులందరికీ తక్షణమే టీకా అందించాలి. కరోనా బారినపడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి'. -చంద్రబాబు
ఇదీ చదవండి: కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి