గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం "రాజ్యాంగ పరిరక్షణ దినం"గా నిర్వహించాలని తెదేపా శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గ్రామగ్రామానా జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించాలని.. హక్కులు, ప్రాథమిక విధులపై ప్రజల్లో చైతన్యం పెంచాలని తెదేపా శ్రేణులకు ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం పార్టీ నాయకులు, గ్రామ కమిటీల బాధ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి "రాజ్యాంగ పరిరక్షణ దినం" కార్యక్రమాన్ని ’ విజయవంతం చేయాలని చంద్రబాబు అన్నారు.
"భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల హక్కులకు రక్షణ కవచం. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలతో ఆ రక్షణ కవచానికి తూట్లు పొడుస్తోంది. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మమే మనని కాపాడుతుంది. రాజ్యాంగాన్ని మనం కాపాడితే, రాజ్యాంగమే మనని కాపాడుతుంది." -చంద్రబాబు
ఇదీ చదవండి: ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డి