రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీకి రూ.3,900 కోట్లు ఇచ్చినట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు 16వేల కోట్ల రూపాయలకుపైగా లోటు ఏర్పడిందని... అది తీర్చే బాధ్యత కేంద్రానికి ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 15 మధ్య కాలంలో రెవెన్యూ లోటు 13,775.76 కోట్లు ఏర్పడిందని, దీనిలోనే ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ఖర్చులు పక్కన పెడితే రాష్ట్ర రెవెన్యూ లోటు కేవలం 4వేల 117 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను ఎప్పటికప్పుడు ఇచ్చినట్టు మరో సమాధానంలో చెప్పారు. వీటి కింద ఏపీకి వేయి 50 కోట్లు, తెలంగాణకు 1800 కోట్లు ఇచ్చినట్టు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి