POLAVARAM: పోలవరం ప్రాజెక్టు పనులు బాగా ఆలస్యమవుతున్నాయని, ఇందుకు కారణాలు వినదలుచుకోలేదని, మీరు చెప్పిన గడువుకు ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాల్సిందేనని నిపుణుల కమిటీ ఛైర్మన్ కేంద్ర జలసంఘం డైరెక్టర్ ఓరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ శని, ఆదివారాల్లో పోలవరంలో పర్యటించింది. చీఫ్ ఇంజినీరు, ఎస్‌ఈ, మేఘా ఇంజినీరింగు కంపెనీ ప్రతినిధులు, ఇతర అధికారులతో కమిటీ సమీక్షించింది. ఓరా ఆధ్వర్యంలో కేంద్ర జలసంఘం నిపుణులు, వివిధ కేంద్ర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి పనిని వారు దగ్గరుండి పరిశీలించారు. ఎక్కడికక్కడ అనేక సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత సమీక్ష సమావేశంలో పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూసేది లేదంటూ ప్రతి పని గురించి కూలంకషంగా విశ్లేషించారు. గతంలో కేంద్ర సలహాదారు వెదిరె శ్రీరాం వచ్చిన సందర్భంలో ఏ పనిని ఎప్పటికి పూర్తి చేస్తారో తేదీలు ఇచ్చారు, ఆ ప్రకారం ఎందుకు చేయడం లేదని ఓరా అధికారులను నిలదీశారు. అధికారులు వివిధ కారణాలు చెప్పగా.. అవన్నీ గడువు తేదీలు చెప్పినప్పుడు మీకు గుర్తుకు రాలేదా? అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ప్రతిచోటా చేస్తాం, చేసేస్తాం అని చెప్పడం తప్ప మరో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పనుల లక్ష్యం, గడువు తేదీల విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని ఆయన తెగేసి చెప్పారు.
పరీక్షలు చేయకుంటే ప్రమాదం..
పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి డిజైన్లు పూర్తి చేయాలంటే తాము చెప్పిన పరీక్షలన్నీ సకాలంలో పూర్తి చేయాల్సిందేనన్నారు. అవి పూర్తి కాకుండా డిజైన్లు ఖరారు చేయలేమన్నారు. ఆ పరీక్షల ఫలితాలన్నీ ముఖ్యమేనని, అవి పరిశీలించకుండా ముందుకు వెళ్తే ప్రమాదం అని కూడా ఓరా హెచ్చరించారు. వివిధ పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న యంత్రాలు సరిపోవని ఏజెన్సీ ప్రతినిధులకు చెప్పారు. ఈసీపీటీ పరీక్షకు సంబంధించి ఒకటే యంత్రం ఉందని, తక్షణమే మరోటి సమకూర్చుకోవాల్సిందేనని చెప్పారు. డయాఫ్రం వాల్ పరిస్థితిపై అధ్యయనం చేయడానికి ఎన్‌హెచ్‌పీసీకి రూ.6 లక్షల చెల్లించాల్సి ఉన్నా ఇంత ఆలస్యం ఎందుకైందని ప్రశ్నించారు. పరీక్షలు వేగంగా పూర్తి చేసేందుకు ఏజెన్సీ మరింత దృష్టి సారించాలని, అధికారులు కూడా పక్కా ప్రణాళిక తయారు చేయాలన్నారు.
జులై 15 నాటికి తమకు ఫలితాలు సమర్పించాలన్నారు. అప్రోచ్ ఛానల్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా నీరు లీక్ అవుతోందని అధికారులు, గుత్తేదారు ప్రతినిధులు చెప్పారు. ఈ సమస్య ఎప్పుడైనా ఉండేదే కదా అని నిలదీశారు. రేడియల్ గేట్లు పెయింట్ చేయకపోవడం, క్రస్టు వద్ద స్టాప్ లాగ్ గేట్లు దించే పనుల్లో ఆలస్యం.. వంటి అంశాలపైనా ఆయన ప్రశ్నించారు. క్యాలెండర్ ఏర్పాటు చేసుకుని ఆ మేరకు పూర్తి చేయాల్సిందేనని, తాను రాజీ పడబోమన్నారు. మళ్లీ తాను సెప్టెంబరులో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ లోపు వెదిరె శ్రీరాం మరోసారి ప్రాజెక్టు సందర్శించే అవకాశం ఉందని కూడా ఓరా వెల్లడించారు.
ఇవీ చదవండి: