తూర్పు గోదావరి జిల్లాలో విస్తృత వర్షాలకు గోదావరి నదికి వరదలు పోటెత్తాయి. సెప్టెంబరు, అక్టోబర్‌లో ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నలను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట నష్టాలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రే నేతృత్వంలోని బృందం సభ్యులు రైతుల బాధలు ఆలకించారు. రావులపాలెం, ఆలమూరు, మండపేట, రామచంద్రపురం, కాకినాడ, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది.
కాకినాడలోని కలెక్టరేట్ లో జిల్లా ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశం నిర్వహించింది. ఫొటో ప్రదర్శనను తిలకించింది. మూడు నెలల్లో కురిసిన భారీ వర్షాలు, గోదావరి, ఏలేరు వరదలవల్ల వివిధ శాఖలకు 2వేల 442 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కలెక్టర్ మురళీధర్ రెడ్డి కేంద్ర బృందానికి నివేదించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు 422 కోట్ల 60 లక్షలు, రహదారులు భవనాల శాఖకు సుమారు 909 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు వివరించారు. పెద్దాపురం మండలం కాండ్ర కోటలో వరదలకు కూలిపోయిన వంతెనను కేంద్ర బృందం పరిశీలించింది. తెదేపా ఎమ్మెల్యే చినరాజప్ప కేంద్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు.
జిల్లాలో జరిగిన నష్టాన్ని రైతులు, అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ విన్నవించారు. విపత్తు నష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన బృందం సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి