తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్(Telugu academy scam) కేసులోని నలుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 60కోట్ల రూపాయల డిపాజిట్లను మాయం చేసి నగదును ఎక్కడికి మళ్లించారనే విషయం తెలుసుకోవడానికి నిందితులను 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. కోర్టు అనుమతిస్తే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం(academy scam case update) ఉంది.
రిమాండ్‌కు నిందితులు
డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సహా ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్‌లను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏపీ మర్కంటైల్ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. యూబీఐలోని డిపాజిట్లను అక్కడికి మళ్లించారు. డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డిపాజిట్లను మాయం చేసినట్లు తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది.
సంతకం ఫోర్జరీ చేశారా..?
దీంతో డిపాజిట్ పత్రాల్లోని సంతకాలను సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డైరెక్టర్ సంతకాలు అసలైనవా.. లేకపోతే ఫోర్జరీ చేశారా అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో తేలిన అనంతరం... దర్యాప్తులో పురోగతి లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. డిపాజిట్లను మాయం చేశారని తెలుగు అకాడమీ ఫిర్యాదు చేయగా.... అధికారులు లేఖ రాయడంతోనే డబ్బులు చెల్లించామంటూ యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ చెబుతుండటంతో పోలీసులు రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరి వాటా ఎంత...?
60కోట్ల రూపాయల నగదును ఎక్కడికి మళ్లించారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుట్రలో భాగస్వాములైనందుకు ఏపీ మర్కంటైల్ ఛైర్మన్ సత్యనారాయణకు 6 కోట్లు ఇచ్చారు. మిగతా 54 కోట్లను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు. మస్తాన్‌వలీ ఒక్కడే ఈ డబ్బంతా తీసుకున్నాడా? లేకపోతే ఎవరెవరికి వాటాలు పంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రూ. 60కోట్లలో 6 కోట్లు మర్కంటైల్ సొసైటీకి పోను మిగతా 54కోట్లను పంచుకున్నారా? లేకపోతే ఇంకే బ్యాంకులోనైనా డిపాజిట్ చేశారా? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై వేటు..
తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్‌మాల్ (Telugu academy scam)కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. అకాడమీ డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచి సోమిరెడ్డిని విద్యాశాఖ తప్పించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
అసలు స్కాం ఏంటి..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu academy scam).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇలా వెలుగులోకి వచ్చింది..
భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: