జగన్ అక్రమాస్తుల కేసులో తి.తి.దే. ఛైర్మన్ Y.V.సుబ్బారెడ్డిపై అభియోగాలు కొట్టివేయవద్దని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన ఇందూ హౌజింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో కేవలం పదకొండున్నర లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి, సుమారు 50 కోట్ల రూపాయల వాటా దక్కించుకున్నారని వాదించింది. ఇందూ హౌజింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో Y.V. సుబ్బారెడ్డి నిందితుడిగా ఉన్నారు. తనపై సీబీఐ కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడినైనందుకే తప్పుడు కేసు పెట్టారని, Y.V. సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ప్రాజెక్టును కొనుగోలు చేస్తే ముడుపులు ఇచ్చారని సీబీఐ అనడం తగదన్నారు. ప్రాజెక్టు దక్కించుకున్న వసంత ప్రాజెక్ట్స్ కు ఆ స్థాయి లేదని సీబీఐ వాదించింది. ప్రాజెక్టు కోసం తెరపైకి తెచ్చిన ఇందూ, ఎంబసీ, యూనిటీ కంపెనీలు తప్పుకున్నాయని.. దానివల్ల వైవీ సుబ్బారెడ్డి, వసంత వెంకట కృష్ణప్రసాద్ ఇద్దరే మిగిలారని కోర్టుకు తెలిపింది. అభియోగాల నమోదు దశలోనే ఉన్నందున కేసు కొట్టివేయవద్దని సీబీఐ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.
ఇవి చదవండి: