CASINO CULTURE: గోవా, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్ క్యాసినో గృహాలకు చిరునామా. స్నేహితులు, సహోద్యోగులు సరదాగా గడిపేందుకు కాస్త ఖర్చయినా దగ్గరదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార, రాజకీయవర్గాలకు చెందిన వారు మకావు, సింగపూర్, మలేసియా, శ్రీలంక మొగ్గుచూపుతున్నారు.
CASINO AGENTS:హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్టణం, గుంటూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జూదప్రియులు అటువైపు వరుస కట్టడంతో జూదగృహాల నిర్వాహకులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఏజెంట్‌కు 20-30శాతం కమీషన్‌గా ఇస్తున్నాయి. క్రికెట్, గుర్రపు పందేల నిర్వాహకులు, పంటర్లు క్యాసినో ఏజెంట్లుగా మారుతున్నారు. తమ పాత పరిచయాలను అవకాశంగా మలచుకొని పెద్దఎత్తున కమీషన్ దండుకుంటున్నారంటూ నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
ప్రత్యేకంగా ఈవెంట్లు: క్యాసినో నిర్వాహకులు స్థానిక ఏజెంట్ల సాయంతో ఆయా నగరాల్లో విందు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మోడల్స్, డ్యాన్సర్‌ను రప్పించి ఆకట్టుకుంటున్నారు. క్యాసినో గృహాన్ని తలపించేలా ఏర్పాట్లతో అనుభూతికి గురయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. వీరి చేతికి డబ్బులిస్తే చాలు.. సకల సదుపాయాలు కల్పిస్తారు. విమాన, బస్సు టిక్కెట్ల నుంచి.. హోటల్ బుకింగ్, జూదశాల ఎంపిక ఏజెంట్లు చేస్తారు.
తెల్లవార్లు ఆటలే: మొదటిసారి వచ్చే వారికి ప్రయాణ టికెట్లు ఉచితంగా అందజేస్తారు. కొందరు ఏజెంట్లు మరో అడుగు ముందుకేసి హోటళ్లను అద్దెకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్టు సమాచారం. పండగలు, సెలవురోజుల్లో రాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ గుట్టుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. నగరంలో ప్రధాన ఏజెంట్లు 10-15 మంది ఉంటే... సబ్ ఏజెంట్లు 2000 మందికి పైగా ఉంటారని అంచనా.
ఇవీ చదవండి: