Illegal arrests: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు, తనిఖీలు, సోదాలు, అరెస్టుల పేరిట ఠారెతిస్తున్నారు. నోటీసులిచ్చేందుకు రాత్రివేళ ఇళ్లలోకి వెళ్లటం, తలుపులు విరగ్గొట్టడం, చీకటిపడ్డాక నిర్బంధించటం, థర్డ్ డిగ్రీ ప్రయోగం తదితర చర్యలకు పాల్పడుతున్నారు. వీరిని అడ్డం పెట్టుకుని వైకాపా ప్రభుత్వం తమకు గిట్టని వారిపై వేధింపులకు తెగబడుతోంది. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయొచ్చా? విచక్షణరహితంగా కొట్టొచ్చా? వారికి చట్టనిబంధనలు వర్తించవా? ఎంత వేధించినా మౌనంగా భరించాల్సిందేనా? అంటే.. కాదంటున్నారు న్యాయ నిపుణులు. అరెస్టయిన వారికీ హక్కులుంటాయనీ, పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
విచక్షణాధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు: ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయాలా, వద్దా అనే విచక్షణాధికారం దర్యాప్తు అధికారిదే. దాన్ని దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో మార్గదర్శకాలిచ్చింది. అయినా అధికార పార్టీకి గిట్టని వారిని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించేవారిని అక్రమంగా అరెస్టు చేయటానికి ఈ విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇందుకోసం సీఆర్‌పీసీ 41ఏ నోటీసుల్ని పోలీసులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
* నోటీసులిస్తే తీసుకోవటానికి నిరాకరించారంటూ ఆ వ్యక్తిని, కుటుంబసభ్యుల్ని భయపెడుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. నోటీసులు తీసుకోవటానికి నిరాకరిస్తే పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి దాన్ని వీడియో చిత్రీకరించి వచ్చేయాలి. లేదా ఆ వ్యక్తి శాశ్వత చిరునామా వద్ద మధ్యవర్తుల సమక్షంలో నోటీసు అతికించి ఆ దృశ్యాలు తీసుకోవాలి.
* నోటీసుల్లో పేర్కొన్న మేరకు విచారణకు హాజరైన వ్యక్తిని రోజంతా కూర్చోబెడుతున్నారు. చివరిలో కాగితాలపై పోలీసు అధికారులకు నచ్చినది రాసుకుని వాటిపై సంతకం చేయాలని బలవంతం చేస్తున్నారు. ఫలానా వ్యక్తి చెప్పినందునే ఇలా చేశానని చెప్పాలంటూ బెదిరిస్తున్నారు.
* కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున లేచేసరికి నోటీసులిచ్చి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి ఉదయం 10 గంటకల్లా విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తున్నారు. ఇది చెల్లదు. 41ఏ నోటీసులిచ్చి విచారణకు రమ్మన్నప్పుడు అందుకు తగిన సమయం ఇవ్వాలి.
* 41ఏ నోటీసులిస్తామంటూ స్టేషన్‌కు పిలిపించి అక్కడ బెదిరిస్తున్నారు.
* వృద్ధులు, చిన్నారులు, మహిళల్ని సాక్షులుగా విచారించాలంటే వారున్న చోటకే వెళ్లాలి. కానీ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు.
* 41ఏ నోటీసుల్లో పేర్కొన్న నిబంధనలకు సంబంధిత వ్యక్తి కట్టుబడి ఉండకపోతే.. మేజిస్ట్రేట్ అనుమతితోనే పోలీసులు అరెస్టు చేయాలి. ఈ నిబంధనా పాటించడం లేదు.
కోర్టు ధిక్కరణ..
* ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఎవరినైనా అరెస్టు చేయాలంటే దర్యాప్తు అధికారి ఆధారాలతో సహేతుక కారణాలు చెప్పాలి. సరైన కారణం చూపకుండా అరెస్టు చేస్తే.. ఆ అధికారిపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయొచ్చు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని కోరవచ్చు.
* సీఆర్‌పీసీ 41ఏ నోటీసులివ్వకుండా దర్యాప్తు అధికారి ఎవరినైనా అరెస్టు చేసి హాజరుపరిస్తే సంబంధిత మేజిస్ట్రేట్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. యాంత్రికంగా రిమాండు విధిస్తే ఆ మేజిస్ట్రేట్‌పైనా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయొచ్చు. శాఖాపరమైన చర్యలు కోరవచ్చు.
దురుసుగా ప్రవర్తించటానికి వీల్లేదు
కస్టడీలో తీసుకున్న ఎవరిపైనయినా పోలీసులు దురుసుగా ప్రవర్తించటానికి వీల్లేదని ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అరెస్టు చేసేటప్పుడు పోలీసులు పాటించాల్సిన మార్గదర్శకాల్ని నిర్దేశించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీసీ చట్టాన్ని సవరించి కొత్తగా పలు సెక్షన్లు జోడించింది.
* నేమ్ బ్యాడ్జి: ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు, విచారిస్తున్నప్పుడు పోలీసు అధికారి.. తన పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా నేమ్ బ్యాడ్జి తప్పనిసరిగా ధరించాలి. సంబంధిత అధికారుల వివరాలన్నీ రిజిస్టర్‌లో రాయాలి.
* అరెస్టు మెమో- సాక్షి సంతకం: అరెస్టు చేసిన తేదీ, సమయం, స్థలం వివరాలతో మెమో రూపొందించాలి. దానిపై అరెస్టయిన వ్యక్తి బంధువులు/ స్థానికంగా ఉండే పెద్దమనుషుల్లో ఒకరితో సాక్షి సంతకం తీసుకోవాలి. అరెస్టయిన వ్యక్తి కౌంటర్ సంతకమూ ఉండాలి. అరెస్టు వివరాలు, ఆ సమాచారాన్ని పోలీసులు ఎవరికి తెలియజేశారు? ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారో స్టేషన్ డైలీ డైరీలో నమోదు చేయాలి.
* గాయాల రికార్డు- ఇన్‌స్పెక్షన్ మెమో: తన శరీరంపై గాయాల్ని రికార్డు చేయాలని అరెస్టయిన వ్యక్తి పోలీసు అధికారిని కోరితే.. పరీక్షించి ఆ వివరాలన్నింటినీ నమోదు చేయాలి. దీన్ని ఇన్‌స్పెక్షన్ మెమో అంటారు. దానిపై అరెస్టయిన వ్యక్తి, పరీక్షించిన అధికారీ సంతకాలు పెట్టాలి. ప్రతిని సదరు వ్యక్తికి తప్పనిసరిగా ఇవ్వాలి.
* అరెస్టు సమాచారం చేరవేత: అరెస్టు సమాచారాన్ని కుటుంబసభ్యులు/బంధువులు/ స్నేహితులకు తెలియజేయాలని ఆ వ్యక్తి కోరితే పోలీసు అధికారి తప్పనిసరిగా చేయాలి. జిల్లా న్యాయ సహాయ కమిటీలకూ ఈ సమాచారాన్ని తెలియజేయాల్సిందే.
* కంట్రోల్ రూమ్- నోటీసుబోర్డు: అరెస్టయిన వ్యక్తులు, వారిని ఎక్కడ నిర్బంధించారో అరెస్టు చేసిన 12 గంటల్లోగా దర్యాప్తు అధికారి పోలీసు కంట్రోల్‌రూమ్‌కు తెలియజేయాలి. దాన్ని అన్ని కంట్రోల్ రూమ్‌ల్లోనూ నోటీసు బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలి.
* న్యాయవాదితో మాట్లాడే హక్కు: అరెస్టయిన వ్యక్తి విచారణ సమయంలో న్యాయవాదిని సంప్రదించొచ్చు. పోలీసులు ఈ హక్కును నిరాకరించలేరు.
* మేజిస్ట్రేట్‌కి సమాచారం: అరెస్టు మెమో, ఇన్‌స్పెక్షన్ మెమో సహా అన్ని రికార్డుల ప్రతుల్ని పోలీసులు స్థానిక మేజిస్ట్రేట్‌కు సమర్పించాలి.\
* 48 గంటలకోసారి వైద్యపరీక్షలు: పోలీసు నిర్బంధంలో ఉన్నప్పుడు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని అరెస్టయిన వ్యక్తి కోరవచ్చు. వైద్యారోగ్య శాఖ ప్యానల్ జాబితాలోని వైద్యులతోనే పరీక్షలు చేయించాలి.
* వారంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు, అరెస్టుకు కారణాల్ని పోలీసు అధికారి తప్పనిసరిగా తెలియజేయాలి. తమ పరిధిలో వారంట్ లేకుండా ఎంతమందిని అరెస్టు చేశారో ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ నివేదిక తయారుచేసి, జిల్లా మేజిస్ట్రేట్/ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌కు పంపాలి.
చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. హక్కుల్ని కాలరాస్తూ
* అరెస్టు చేయటానికి వెళ్లేటప్పుడు చాలాసార్లు పోలీసులు మఫ్టీలోనే ఉంటున్నారు. వారి పేరు, హోదా సూచించే నేమ్ ప్లేట్ ధరించట్లేదు. వివరాలడిగినా చెప్పట్లేదు.
* సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వటానికంటూ రాత్రి 10 గంటల తర్వాత, అర్ధరాత్రి వేళా కొందరి ఇళ్లకు వెళ్తున్నారు. మందీమార్బలంతో వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
* నిందితుడు నోటీసులిస్తే తీసుకోవటానికి నిరాకరించారంటూ అప్పటికప్పుడే అదుపులోకి తీసుకుని, తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటిస్తున్నారు.
* ఏ నేరంపై కేసు నమోదు చేశారో, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండానే కొందర్ని తీసుకెళ్లిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారో కూడా చెప్పట్లేదు.
* ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపేవారిని వేధించటమే లక్ష్యంగా రాత్రి వేళ అరెస్టు చేసి, తర్వాత రోజు కోర్టులో హాజరుపరిచేవరకు చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు చెబితే.. మరిన్ని కేసుల్లో ఇరికిస్తామని, విడిచిపెట్టబోమని బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
* పోలీసు దెబ్బలకు గాయాలైనా ఆ వివరాలేవీ లేకుండా తప్పుడు నివేదికలు ఇచ్చేలా వైద్యాధికారులపైనా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేటు కేసులు వేయొచ్చు: పోలీసులు ఎవరినైనా అక్రమంగా అరెస్టు చేసినా, నిర్బంధించి కొట్టినా, హింసించినా, అసభ్యపదజాలంతో దూషించినా సంబంధిత అధికారిపై.. బాధిత వ్యక్తి స్థానిక మేజిస్ట్రేట్ కోర్టుల్లో ప్రైవేటు కేసు పెట్టొచ్చు. సదరు పోలీసు అధికారిని వ్యక్తిగతంగా బాధ్యుడ్ని చేయాలి. ఎవరు కొట్టారు? ఎలా హింసించారు? అరెస్టు సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? వంటి వివరాలతో బాధితుడు వాంగ్మూలం రాసి, దాని ఆధారంగా ఎప్పుడైనా సరే కోర్టులో కేసు వేయొచ్చు. - పోసాని వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాది, హైకోర్టు
అక్రమంగా అరెస్టు చేస్తే పర్యవసానాలు తప్పవు: కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకుడు ఆదేశించాడనో, ఉన్నతాధికారి చెప్పారనో అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. తమ చర్య చట్టప్రకారం ఉందా లేదా నిర్ధారించుకున్నాకే పోలీసులు ముందుకెళ్లాలి. ఎవరో చెప్పారని అక్రమ అరెస్టులు చేస్తే.. బాధిత వ్యక్తి ప్రైవేటు కేసులు వేయొచ్చు. అప్పుడు ఆ పోలీసు అధికారి చిక్కుల్లో పడతారు. అక్రమ నిర్బంధం, కొట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగం చట్టబద్ధం కావు. నేర విచారణలో ఇవి నిరూపణైతే ఉద్యోగం పోతుంది. శిక్ష కూడా పడుతుంది. -ముప్పాళ్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
అక్రమ అరెస్టును ప్రతిఘటించొచ్చు:
‘పోలీసులు అరెస్టు చేస్తే’ అనే పుస్తకంలో బొజ్జా తారకం
* ఏ నేరాభియోగంపై అరెస్టు చేస్తున్నారో అడిగే హక్కు బాధితులకు, చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. ఏ అభియోగం, ఆధారం లేకుండా, సమాచారమూ ఇవ్వకుండా అరెస్టు చేయటానికి ప్రయత్నిస్తే ప్రశ్నించొచ్చు. ప్రతిఘటించొచ్చు. తప్పించుకోవచ్చు.
* కొట్టే అధికార పోలీసులకు ఎక్కడా లేదు. సమాచారాన్ని రాబట్టటానికి, నేరం అంగీకరింపజేసేందుకు కూడా కస్టడీలో కొట్టడం, చిత్రహింసలు పెట్టడం న్యాయశాస్త్ర నియమాలకే గొడ్డలిపెట్టు. పౌరుల్ని సంరక్షిస్తారనుకునే వాళ్లే వీటికి పాల్పడటం మరీ ఘోరం.
* అరెస్టు, విచారణ సమయంలో నిబంధనలు పాటించని అధికారులపై శాఖాపరమైన చర్యలతోపాటు కోర్టు ధిక్కరణ చర్యలూ చేపట్టాలి.
ఇవీ చదవండి: