Primary education: ‘ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన కల్పించకుండా బలవంతంగా 2.5 లక్షల మంది పిల్లల్ని తరలించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బడి ఉంటుందో లేదో అనే కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చేరలేదు. బాలికల పాఠశాలల్లోనూ బాలురను కలిపేశారు’ అని ‘బడి కోసం బస్సు యాత్ర’ నివేదిక పేర్కొంది. పాఠశాలల విలీనంపై ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు పాఠశాల విద్యా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, యూటీఎఫ్, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు జులై 25 నుంచి 31 వరకు వారం రోజులపాటు 24 జిల్లాల్లోని 72 పాఠశాలల్ని సందర్శించారు. దీనిపై ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నివేదిక విడుదల చేశారు. గతేడాది 250 మీటర్లలోపు బడుల్లో తరగతులను విలీనం చేశారు. వీటి ఫలితాలేమిటో ఇప్పటి వరకు వివరించలేదు. ఆంగ్ల మాధ్యమం అమలుకు ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించిన విద్యాశాఖ.. బడుల విలీనంపై మాత్రం తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,480 ప్రాథమిక పాఠశాలలు కాగితాల్లో విలీనమయ్యాయి. నివేదికలో కీలకాంశాలివీ..
తగ్గిన ప్రవేశాలు
* బడి ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ప్రవేశాలు నిర్వహించలేదు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రవేశాలు భారీగా తగ్గాయి. గతంలో కంటే విద్యార్థులు పెరిగారని చెప్పే బడులే లేవు. కర్నూలు జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాల నుంచి 37 మందిని హైస్కూల్‌కు పంపితే అందరూ ప్రైవేటు బడికే వెళ్లిపోయారు.
* 3, 4, 5 తరగతులు తరలిపోతే 1,2 తరగతుల్లో ఎక్కువ చోట్ల 10 మందిలోపే విద్యార్థులు మిగులుతున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. చిన్న బడుల్లో చదువురాదంటున్న విద్యాశాఖ వీటిని కొనసాగిస్తుందా? వీటిలో ఉపాధ్యాయులను ఉంచుతుందా? 1,2 తరగతుల్లో విద్యార్థులు లేకపోతే వచ్చే ఏడాది మూడో తరగతికి పిల్లలు ఎక్కణ్నుంచి వస్తారు?
* పాఠశాలల విలీనంలో దూరాన్ని ప్రాథమిక పాఠశాల నుంచే లెక్కించారు. విద్యార్థి ఇంటి నుంచి దూరాన్ని పట్టించుకోలేదు. దీంతో కొన్నిచోట్ల దూరం కిలోమీటరు కంటే ఎక్కువగా ఉంది. పేద తల్లిదండ్రులిద్దరూ ఉదయాన్నే పనికి వెళ్లాల్సి రావడంతో పిల్లల్ని బడికి తీసుకెళ్లి, సాయంత్రం తీసుకురావడం వారికి సాధ్యమవడం లేదు. గోదావరి జిల్లాల్లో పంట కాల్వలు దాటి వెళ్లాల్సి వస్తోంది. పట్టణాల్లో రహదారులపై చిన్నారులు నడిచివెళ్లడం మరింత ప్రమాదకరంగా మారుతోంది.
* ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూళ్లలో తరగతులు విలీనం చేసినచోట పిల్లలు బడికి వెళ్లేందుకు మొరాయిస్తున్నారు. బడి కొత్తగా ఉండటం, దూరం కావడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై బాలల హక్కుల వేదికతో స్వతంత్రంగా అధ్యయనం చేయించాలి.
* ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే కలిసి బడికెళ్లేవారు. ఇప్పుడు చెరో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కిలోమీటరు దూరం పుస్తకాల సంచితో నడిచి వెళ్లిరావడం పిల్లలకు కష్టమవుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
* శ్రీకాకుళం జిల్లా పలాస, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రామవరప్పాడు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5.. 1,2 తరగతులను వేర్వేరుగా నిర్వహించడంతో పాఠశాలలు ఛిన్నాభిన్నమయ్యాయి.
* ‘నాడు-నేడు’ మొదటి దశ కింద పనులు చేసిన ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతుల పిల్లల్ని తరలించారు. 1, 2 తరగతులకే పరిమితమైన ఈ బడుల అభివృద్ధికి రూ.లక్షలు ఎందుకు ఖర్చు చేసినట్లు? మరోవైపు పిల్లల్ని తరలించాక తీరిగ్గా ఉన్నత పాఠశాలల్లో గదులు నిర్మిస్తుండటం గమనార్హం.
బుల్డోజరు సంస్కరణలు
సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా బుల్డోజరు సంస్కరణలు అమలు చేస్తున్నారు. బాలికల ఉన్నత పాఠశాలల్లోనూ బాలురను విలీనం చేశారు. కాకినాడ జిల్లా రావులపాలెం మెయిన్‌లో ఇదే జరిగింది.
* ఉర్దూ, తమిళం వంటి మాధ్యమ పాఠశాలల్ని తెలుగు బడుల్లో కలిపేశారు. తెలుగేతర విద్యార్థులకు ఆ భాష తెలిసిన ఉపాధ్యాయులతో బోధించాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా విలీనం చేశారు. భవిష్యత్తులో సరిహద్దులోని తెలుగు పాఠశాలలను అయా రాష్ట్రాలు ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి?
* తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ నీర్జాపేట ఓ సామాజిక వర్గ పిల్లలు ఇప్పుడిప్పుడే బడి ముఖం చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని బుచ్చినాయుడు కండ్రిగ ఉన్నత పాఠశాలలో కలిపారు. రోడ్లు దాటి పిల్లలు బడికి వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
* ‘పోరాడి తెచ్చుకున్న బడి ఇది. మూడు తరాలుగా ఇక్కడే చదువుకున్నాం. మా బిడ్డలకు దక్కకుండా పోతోంది’ అని ఏలూరు వెంకటేశ్వరపురానికి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పిల్లలు ఏలూరు నగరం సందులు, గొందులు దాటి పాఠశాలకు వెళ్లాలి.
* విద్యాశాఖ ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. బలవంతంగా పిల్లల టీసీలు తీసుకెళ్లి ఉన్నత పాఠశాలలో ఇచ్చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం నిలిపేస్తున్నారు. పిల్లలు వెళ్లకపోయినా టీచర్లను బలవంతంగా పంపేస్తున్నారు. టీచర్లను బెదిరిస్తున్నారు.
* రోజూ నడిచే దారిని వదిలేసి ఇష్టం వచ్చిన మార్గంలో దూరాన్ని లెక్కించారు. దారిలో చెరువులు, రోడ్లున్నా పట్టించుకోలేదు. వీటిపై తల్లిదండ్రుల వినతులను తీసుకోవడం లేదు. దూరపు బడికి పిల్లల్ని పంపలేక, చెప్పుకుందామంటే మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అందుబాటులో లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి: