జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) అమలైన తర్వాత రాష్ట్రానికి రావల్సిన రేషన్ రావడం లేదని, ఆ పరిమాణం పెంచాలని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్రమంత్రిని బుధవారం ఆయన కలిశారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు 75 శాతం, పట్టణ ప్రాంతాలకు 50శాతం రేషన్ రావల్సి ఉండగా.. 60 శాతం, 40 శాతం మాత్రమే వస్తోందని వివరించారు. పేదలకు చౌక బియ్యం అందించాల్సి ఉండడంతో ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోందని తెలిపారు. రబీ ధాన్యం సేకరణ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రానికి రావల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా అన్నారు. అనంతరం నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్‌లను కలిసినట్లు బుగ్గన తెలిపారు. పోలవరం, ఇతర నీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిహారం, పునరావాసాలపై చర్చించానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం చేపడుతోందని, ఆ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. వారు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి: కృష్ణా బోర్డు